రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారైన మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూఢ్ తహసీల్‌లోని ఒక పర్యాటక ప్రాంతంలో ఈ సామూహిక అత్యాచార ఘటన అక్టోబర్ 21న చోటుచేసుకుంది. రేవా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హిమాలి పాఠక్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. బాధిత మహిళకు ఇటీవలే వివాహం జరిగిందని, ఆమె, ఆమె భర్త వయస్సు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిద్దరూ ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్నారని తెలిపారు.
బాధితురాలిని పోలీసులు విచారించినప్పుడు.. ఆమె తనపై లైంగిక దాడికి పాల్పడిన ఎనిమిది మందిలో ఒకరికి చేతులు, ఛాతీపై టాటూలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.
బాధిత దంపతులు గూఢ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారన్నారు. వెంటనే తాము ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. గూఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ వద్ద ఆ మహిళ, ఆమె భర్త గొడవ పడ్డారని డీఎస్పీ తెలిపారు. అదే ఫౌంటెన్ దగ్గర ఐదుగురు వ్యక్తులు తనపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది.
ఈ కేసులో పోలీసులు గుర్హ్ నివాసి రామ్‌కిషన్ కోరి, దీపక్ కోరి, రవేష్ కుమార్ గుప్తా, రాంపూర్ బఘెలాన్ వాసి సుశీల్ కోరి, రాజేంద్ర కోరి, తరుణ్ కోరి, నైగర్హి వాసి లవకుష్ కోరిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గూఢ్ నివాసి రజనీష్ కోరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
నిందితులు బాధితురాలి భర్తను బందించారని ఎస్పీ సింగ్ తెలిపారు. అలాగే వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రికార్డు చేశారన్నారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన రెండు రోజుల వరకూ ఎవరికీ తెలియజేదని, ఇది ఆటవిక రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంశాఖ పేరును జంగిల్ రాజ్ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ 18 నుంచి 20 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
Comments
Please login to add a commentAdd a comment