
భార్యకు దూరంగా ఉండాలని..
ఆయన వయస్సు 70 ఏళ్లు. భార్యతో చాలా పెద్దగా గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్నాడు. 'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను' అని శపథం చేశాడు. భార్యకు దూరంగా ఉండాలంటే విడాకులో, బ్రేకప్ చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్.. అందుకే ఆయన దగ్గరి మార్గాన్ని ఎన్నుకున్నాడు.
తన ఇంటికి సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. తన దగ్గర తుపాకీ ఉందని, కాబట్టి మర్యాదగా తనకు డబ్బు ఇవ్వాలని క్యాషియర్ ను భయపెట్టాడు. ఆ వృద్ధుడికి భయపడ్డ క్యాషియర్ మూడువేల డాలర్లు అతని చేతిలో పెట్టాడు. అయినా, ఆ మొండిఘటం అక్కడినుంచి కదల్లేదు. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ పెద్దాయనను అరెస్టు చేశారు.
యాహూ.. నా కల నెరవేరిందంటూ ఆ వృద్ధుడు ఎగిరి గంతేశాడు. అమెరికాలోని కాన్సస్ నగరంలో ఈ ఘటన జరిగింది. 70 ఏళ్ల లారెన్స్ రిపిల్ తన భార్య రెమిడియోస్ తో గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్న ఆయన కాన్సస్ సిటీ బ్యాంకులో దోపిడికి పాల్పడ్డాడు. తన వద్ద తుపాకీ ఉందంటూ బెదిరించి డబ్బులు దోపిడి చేసిన ఆయన.. పోలీసులు వచ్చేవరకు వేచి ఉండి వారికి లొంగిపోయాడు.
గయ్యాళీ సూర్యకాంతం లాంటి భార్య ఉన్న ఇంటికంటే తన కొత్త లొగిలి అయిన జైలే బాగుందని, ఇక్కడ మంచి సహచర ఖైదీలు, టైమ్ కు తిండి, నిద్ర, సరైన వైద్య చికిత్స లభిస్తున్నాయని పెద్దాయన లారెన్స్ రిపిల్ ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు.