లాభాల్లో ఆంధ్రాబ్యాంక్ ఢమాల్
Published Sat, Aug 6 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
ముంబై: నిరుత్సాహకర ఫలితాలతో ఆంధ్రాబ్యాంక్ ఢమాల్ అంది. ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రా బ్యాంక్ ఈ ఏడాది( 2016-17) తొలి త్రైమాసికంలో నికర లాభాలు దాదాపు 85 శాతం (84.64) క్షీణించాయి. గతేడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 203 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది కేవలం రూ. 31 కోట్లను మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం దాదాపు 10 శాతం జంప్‌చేసి రూ. 1269 కోట్లను తాకగా, మొత్తం ఆదాయం కూడా 7 శాతం పెరిగి రూ. 4855 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 56 శాతం ఎగసి రూ. 969 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.87 శాతం నుంచి 2.90 శాతానికి పెంచుకోగలిగింది. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 5.75 శాతం నుంచి 10.30 శాతానికి జంప్‌చేయగా, నికర ఎన్‌పీఏలు కూడా 2.99 శాతం నుంచి 6.21 శాతానికి పెరిగాయి. నిర్వహణ వ్యయాలు 16.6 శాతం అధికమై రూ. 753 కోట్లను తాకగా, మొత్తం డిపాజిట్లు 16 శాతంపైగా ఎగసి రూ.1,78,268 కోట్లకు చేరాయి. ఇక రుణ విడుదల (అడ్వాన్సెస్) కూడా 9 శాతం పెరిగి రూ. 1,37,228 కోట్లుగా నమోదయ్యాయి.
బిజినెస్ గ్రోత్ 13-14 ఉంటుందని ఆశిస్తున్నామని ఆంధ్రబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేష్ ఎన్ పటేల్ చెప్పారు. ఈ త్రైమాసికంలో రిటైల్ క్రెడిట్ పోర్ట్ఫోలియో విస్తరణ ద్వారా బ్యాంకు రెవెన్యూ, మార్జిన్స్ 26.5 శాతం పెరిగిందన్నారు. బ్యాంక్ పై స్లిప్ పేజేస్ భారం గత క్వార్టర్‌లోని రూ. 2500కోట్లతో పోలిస్తే రూ.3500కోట్లకు చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల ప్రవేశ పెట్టబడిన సస్టైనబుల్ స్ట్రక్టరింగ్ ఆఫ్ స్ట్రెస్స్డ్ ఎస్సెట్స్ పథకం నుంచి తమకు ఎలాంటి నిర్దేశాలు అందలేదని ఒక ప్రశ్నకు సమాధానం పటేల్ చెప్పారు.
Advertisement
Advertisement