‘గ్రేటర్’పై ప్రభుత్వం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏ ప్రాంతానికి ఎన్ని అప్పులు, ఎన్ని ఆస్తులనేది తేల్చలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రాంతాల వారీగా ఆదాయ, వ్యయాలు, రెవెన్యూ లోటు, గ్రేటర్ హైదరాబాద్ ఆదాయ, వ్యయాలు, ఉద్యోగులు, పెన్షనర్ల సమాచారం, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీకి అందజేయనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదాయ, వ్యయాలను, రెవెన్యూ లోటును ఇప్పటికిప్పుడు తేల్చడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని అయినందున ఇతర ప్రాంతాలకు చెందిన పన్నులను హైదరాబాద్‌లోనే చెల్లిస్తున్నారని, అలాగే హైదరాబాద్ పీఏవో కార్యాలయం నుంచే ఎక్కువ మొత్తంలో పనులకు బిల్లుల చెల్లింపు జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఆదాయం ఎంత, ఎంత వ్యయం అనేది తేల్చలేమని పేర్కొంది. జిల్లా ట్రెజరీల వారీగా ఆదాయం, వ్యయాలను, శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను, జిల్లాల వారీగా పెన్షనర్ల వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
2012-13 ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాల ట్రెజరీల ద్వారా అన్ని రకాల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.68 వేల కోట్లు. ఇందులో రంగారెడ్డి జిల్లా ట్రెజరీ నుంచి వచ్చిన మొత్తం ఆదాయ వనరులు రూ.28వేల కోట్లు కాగా హైదరాబాద్ (పట్టణ) ట్రెజరీ నుంచి వచ్చిన ఆదాయ వనరులు మొత్తం రూ.27,000 కోట్లు.
ప్రస్తుత ఆర్థిక (2013-14) సంవత్సరంలో నవంబర్ వరకు అన్ని జిల్లాల ట్రెజరీల ద్వారా వచ్చిన ఆదాయ వనరులు రూ.46 వేల కోట్లు. ఇందులో అన్ని ట్రెజరీల ద్వారా నవంబర్ వరకు చేసిన వ్యయం రూ.38 వేల కోట్లు. ప్రత్యేకంగా హైదరాబాద్ పీఏవో కార్యాలయం నుంచి నవంబర్ వరకు వివిధ పనులకు ఖర్చు చేసిన నిధులు రూ.11,500 కోట్లు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు 1,700 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు తేలింది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ప్రస్తుతం మంజూరు చేసి కొనసాగుతున్న ఉద్యోగుల సంఖ్య 10,87,567 మంది. అలాగే అన్ని జిల్లాల్లో కలిపి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సంఖ్య 5,69,00 కాగా వారికి నెలకు రూ.1,200 కోట్లు పెన్షన్‌గా చెల్లిస్తున్నారు.
ఆస్తులు, అప్పులెన్నో తేల్చలేం
Published Thu, Jan 9 2014 1:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement