సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరిన నేపథ్యంలో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు ఆయన వద్దకు క్యూ కట్టారు. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం స్వదేశానికి చేరుకున్న రాష్ర్టపతిని ఇరు ప్రాంత ఎంపీలు విడివిడిగా కలుసుకున్నారు. ప్రణబ్ 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలి పేందుకు రాష్ట్రపతిభవన్‌కు వెళ్లిన ఎంపీలు పనిలోపనిగా విభ జనపై విన్నపాలను ఆయన ముందుంచారు. విభజన ప్రక్రియ ను వేగిరం చేయాలని, త్వరగా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపాలని తెలంగాణ ప్రాంత ఎంపీలు కోరగా, అడ్డగోలుగా జరుగుతున్న విభజనను రాజ్యాంగపెద్దగా అడ్డుకోవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు విన్నవించారు.
ఇక సొంత పార్టీపైనే సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంపైనా రెండు ప్రాంతాల నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ నేతలు అంటుంటే, విభజన జరుగుతున్న తీరే అనైతికమని, దానిని అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధమని సీమాంధ్ర నేతలు గట్టిగా చెబుతున్నారు. రాష్ట్రపతి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను కలవాలని ఒకరోజు ముందుగానే సీమాంధ్ర ఎంపీలు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. బుధవారం పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం ఆయన్ను కలవాలని ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్, రాయపాటి, సాయిప్రతాప్, బాపిరాజు, అనంత, మాగుంట నిర్ణయించుకొని లేఖను తయారు చేసుకున్నారు. ఇది తెలుసుకున్న టీ ఎంపీలు అప్పటికప్పుడు రాష్ట్రపతి కార్యాలయానికి ఫోన్‌లు చేసి సీమాంధ్ర నేతలకన్నా ముందుగానే అపాయింట్‌మెంట్ సాధించారు.
ఎంపీలు మధుయాష్కీ, పొన్నం, రాజయ్య, పాల్వాయి, షెట్కార్, మంద, వివేక్ తదితరులు ప్రణబ్‌ను కలిశారు. శుభాకాంక్షలు చెబుతూనే ‘జన్మదిన కానుకగా త్వరగా బిల్లును అసెంబ్లీకి పంపించి, ప్రక్రియను వేగవంతం చేయండి’ అని విన్నవించారు. దీనికి ఆయన నవ్వి ఊరుకున్నారని తెలిసింది. తర్వాత సీమాంధ్ర ఎంపీలు ప్రణబ్‌ను కలిసి రెండు పేజీల వినతి పత్రం అందించారు. ‘రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరుగుతోంది. కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధంగా లభించిన నిర్ణయాధికారాన్ని ఉపయోగించి మీరు విభజనను అడ్డుకోవాలి. అసెంబ్లీలో దీనిపై తీర్మానం వచ్చాకే ముందుకెళ్లాలి’ అని వారు కోరినట్లుగా తెలిసింది. దీనికి సైతం ప్రణబ్ నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. అంతకుముందు పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలు.. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలతో చర్చలు జరిపారు. తెలంగాణపై తమను పూర్తిగా విస్మరించి ముందుకెళుతున్నందునే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని, దానికి సహకరించాలని కోరారు. ఈ అంశంపై అద్వానీ ఎలా స్పందించిందీ తెలియనప్పటికీ సీమాంధ్ర ఎంపీలు మాత్రం అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తెలిపిందని ప్రకటించారు.