
ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు
హైదరాబాద్: నగరశివారులోని ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ స్కూటర్ డిక్కీ పేలిన అంబేద్కర్ నగర్ ప్రాంతంలోనే ఆదివారం మధ్యాహ్నం మరోసారి గుర్తుతెలియని వస్తువు పేలిపోయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
శనివారం నాటి పేలుడులో ఒక వ్యక్తి గాయపడగా, ఆదివారం సంభవించిన పేలుడు ధాటికి ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతంలో రెండు రోజులు ఇలా వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. తాజా పేలుడు ఎందుకు జరిగిందనే విషయం తెలియాల్సిఉంది. కాగా, శనివారం నాటి స్కూటర్ డిక్కీ పేలుడుకు కిరోసిన్, పెట్రోల్ లేదా జెలిటిన్ స్టిక్స్ కారణం అయిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. (స్కూటర్ డిక్కీలో పేలుడు)