హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల భవనాల (గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ తరహా నిర్మాణాల్లో మెళకువలు నేర్పే జాతీయ శిక్షణ సంస్థ ‘అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎఫిసెంట్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ’ ఏర్పాటు కాబోతోంది. దీనికి జర్మనీ మేథో సహకారం అందించనుండగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ఇవ్వనుంది. దేశంలో హైదరాబాద్‌తోపాటు ముంబై, కోల్‌కతాల్లో ఇవి ఏర్పాటవుతాయి.
మాదాపూర్‌లోని న్యాక్‌కు అనుబంధంగా వచ్చే ఈ కేంద్రం అదే ప్రాంగణంలో సిద్ధం కానుంది. దీనికి కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వనుంది. రెండేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు మరో రూ.5 కోట్లు ఇస్తుంది. వెంటనే పనులు మొదలయ్యేలా లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంజనీర్లకు శిక్షణ
పర్యావరణంపై దుష్ర్పభావం లేకుండా నిర్మాణాలను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీన్ బిల్డింగ్ అంశం బాగా అభివృద్ధి చెందింది. మన దేశంలో దీనిపై అంతగా అవగాహన లేదు. దీంతో ఇంజనీర్లను ఆ దిశగా సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచంలో నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వటంలో ముందున్న జర్మనీని సాయం కోరింది. దీంతో జర్మనీ ప్రత్యేకంగా నిపుణులను మనదేశానికి పంపగా, వారు వివిధ ప్రాంతాల్లోని న్యాక్ తరహా కేంద్రాలను పరిశీలించారు.
అభివృద్ధి చేస్తాం: తుమ్మల
న్యాక్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి దాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గురువారం న్యాక్ 17వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాక్ సిబ్బంది అతి తక్కువ జీతాలకే పనిచేస్తున్నారని సంస్థ డీజీ భిక్షపతితోపాటు డెరైక్టర్ శాంతిశ్రీ, ఫైనాన్స్ డెరైక్టర్ హేమలత, ఇతర అధికారులు వెంకట్రామయ్య, గంగాధర్‌లు అదే సభలో పేర్కొనటంతో మంత్రి వెంటనే స్పందించారు.
వారి జీతాల పెంపుతోపాటు సర్వీసు క్రమబద్ధీకరణకు సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. న్యాక్‌లో యువతకు నిర్మాణరంగంలో మెళకువలు నేర్పటం ద్వారా ఉపాధిని మెరుగుపరుస్తామన్నారు. సంవత్సర కాలంలో 3,800 మందికి శిక్షణ ఇస్తే 3,200 మందికి ఉద్యోగాలు లభించాయని సంస్థ డీజీ బిక్షపతి పేర్కొన్నారు.