National Training Institute
-
హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల భవనాల (గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ తరహా నిర్మాణాల్లో మెళకువలు నేర్పే జాతీయ శిక్షణ సంస్థ ‘అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎఫిసెంట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ’ ఏర్పాటు కాబోతోంది. దీనికి జర్మనీ మేథో సహకారం అందించనుండగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ఇవ్వనుంది. దేశంలో హైదరాబాద్‌తోపాటు ముంబై, కోల్‌కతాల్లో ఇవి ఏర్పాటవుతాయి. మాదాపూర్‌లోని న్యాక్‌కు అనుబంధంగా వచ్చే ఈ కేంద్రం అదే ప్రాంగణంలో సిద్ధం కానుంది. దీనికి కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వనుంది. రెండేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు మరో రూ.5 కోట్లు ఇస్తుంది. వెంటనే పనులు మొదలయ్యేలా లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీర్లకు శిక్షణ పర్యావరణంపై దుష్ర్పభావం లేకుండా నిర్మాణాలను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీన్ బిల్డింగ్ అంశం బాగా అభివృద్ధి చెందింది. మన దేశంలో దీనిపై అంతగా అవగాహన లేదు. దీంతో ఇంజనీర్లను ఆ దిశగా సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచంలో నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వటంలో ముందున్న జర్మనీని సాయం కోరింది. దీంతో జర్మనీ ప్రత్యేకంగా నిపుణులను మనదేశానికి పంపగా, వారు వివిధ ప్రాంతాల్లోని న్యాక్ తరహా కేంద్రాలను పరిశీలించారు. అభివృద్ధి చేస్తాం: తుమ్మల న్యాక్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి దాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గురువారం న్యాక్ 17వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాక్ సిబ్బంది అతి తక్కువ జీతాలకే పనిచేస్తున్నారని సంస్థ డీజీ భిక్షపతితోపాటు డెరైక్టర్ శాంతిశ్రీ, ఫైనాన్స్ డెరైక్టర్ హేమలత, ఇతర అధికారులు వెంకట్రామయ్య, గంగాధర్‌లు అదే సభలో పేర్కొనటంతో మంత్రి వెంటనే స్పందించారు. వారి జీతాల పెంపుతోపాటు సర్వీసు క్రమబద్ధీకరణకు సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. న్యాక్‌లో యువతకు నిర్మాణరంగంలో మెళకువలు నేర్పటం ద్వారా ఉపాధిని మెరుగుపరుస్తామన్నారు. సంవత్సర కాలంలో 3,800 మందికి శిక్షణ ఇస్తే 3,200 మందికి ఉద్యోగాలు లభించాయని సంస్థ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. -
బందరు వద్ద మెరైన్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జాతీయస్థాయి శిక్షణ సంస్థ రాబోతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం తీర ప్రాంతంలో జాతీయ మెరైన్ అకాడమీ(ఎన్ఎంఏ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మచిలీపట్నం సమీపంలోని పెద్దపట్నం తీరప్రాంతంలో 300 ఎకరాలలో ఎన్ఎంఏ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించారు. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి అధికారులు డిసెంబర్లో స్వయంగా వచ్చి అకాడమీ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించనున్నారు. తర్వాత తుది ఆమోదం తెలపనున్నారు. ఏర్పాటు ఖాయమైతే దేశంలో మెరైన్ పోలీసులకు శిక్షణ అందించే మొట్టమొదటి అకాడమీ ఇదే అవుతుంది. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించిన నేపథ్యంలో తీర ప్రాంత భద్రతపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టిసారించింది. అలాగే దేశంలో అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిన మావోయిస్టులకు కూడా సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు అందుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక మెరైన్ పోలీస్‌స్టేషన్ వంతున ఇప్పటి వరకూ 21 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. తీరప్రాంతంతోపాటు సముద్ర నీటిలోనూ నిఘా కోసం మరబోట్లను మెరైన్ పోలీసులకు అందించారు. ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు 30 మంది చొప్పున 600లకుపైగా సిబ్బంది ఉన్నారు. మెరైన్ సిబ్బందికి కోస్ట్‌గార్డ్, నేవీ విభాగాల ద్వారా తాత్కాలిక శిక్షణ అందిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా అకాడమీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వరకూ తూర్పు తీర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల మెరైన్ పోలీసులకూ మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయనున్న ఎన్‌ఎంఏలో శిక్షణ అందించనున్నారు. పశ్చిమ తీర ప్రాంతంలో మరో జాతీయ మెరైన్ అకాడమీ ఏర్పాటును కూడా కేంద్రం పరిశీలిస్తోంది. మన రాష్ట్రంలో భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ప్రతిపాదనలు అందించడంతో మొదటి అకాడమీ ఇక్కడే ఏర్పడబోతోంది. 300 ఎకరాల కేటాయింపునకు ప్రభుత్వం ఓకే మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోని పెద్దపట్నం వద్ద సముద్రానికి ఆనుకుని ఉన్న 300 ఎకరాల భూమిని ఎన్‌ఎంఏకి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి బృందం డిసెంబర్లో ఈ భూములను పరిశీలిస్తుందని, అనంతరం ఎన్ఎంఏ ఏర్పాటుకు పూర్తిస్థాయి ఆమోదం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నంలో కోస్ట్‌గార్డ్, నేవీ విభాగాలు అందుబాటులో ఉండటం, దగ్గర్లో గన్నవరం విమానాశ్రయం ఉండటం వల్ల ఎన్‌ఎంఏకి శిక్షకులు వచ్చేందుకు కూడా సులువవుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది.