మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెత్
- మొన్న ఇన్ఫోటెక్‌లో హత్య.. నేడు టీసీఎస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
- పుణెలోని ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులో కలకలం
పూణె: ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా టెక్కీని కంప్యూటర్ కేబుళ్లతో దారుణంగా హతమార్చిన ఉదంతం చల్లారకముందే టీసీఎస్‌కు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతున్నది. ఇక్కడి ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులో పనిచేస్తోన్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వారం రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఇటు ఐటీవర్గాలతోపాటు, అటు ఉద్యోగుల కుటుంబాల్లోనూ కలవరం రేపుతున్నది. ఇన్ఫోటెక్ పార్కులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో ఇంజనీర్‌గా పనిచేస్తోన్న అభిషేక్ కుమార్ గురువారం రాత్రి తన ఫ్లాట్‌లో అనుమానాస్పదరీతిలో మరణించాడు. పుణె పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అభిషేక్ కుమార్.. పుణెలో టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయమంతా రూమ్‌మేట్స్‌తో గడిపిన అభిషేక్.. మధ్యాహ్నానికి నిద్ర వస్తోందంటూ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. కొద్ది సేపటికే అభిషేక్‌కు చెందిన మరో స్నేహితుడి నుంచి రూమ్‌మేట్స్‌కు ఫోన్ వచ్చింది. ‘అతను ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.. ఆపండి’అనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. వెంటనే అప్రమత్తమైన రూమ్‌మేట్స్.. బెడ్‌రూమ్ లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో కిటికీలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే అభిషేక్ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. అతణ్ని కిందికిదించి, సమీపంలోని ఆస్పత్రికి తరలించడా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అభిషేక్ స్నేహితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులోనే పనిచేస్తోన్న ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమే అభిషేక్ బలవన్మరణానికి కారణమని సమాచారం. చనిపోవడానికి ముందు ఆ అమ్మాయికి మెసేజ్‌లు పంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిషేక్ మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, పరీక్షిస్తున్నామని, అతని రూమ్‌మేట్స్, స్నేహితులను విచారిస్తేగానీ ఈ కేసు ఓ కొలిక్కిరాదని దర్యాప్తు అధికారి మీడియాతో అన్నారు. ఇక, ఇన్ఫోటెక్ కార్యాలయంలో హత్యకు గురైన కేరళ యువతి ఆనంద్ కె రాసిలా రాజు (25) కుటుంబానికి రూ.1కోటి నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
(మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య)