వర్షాల్లో చిక్కుకుపోయిన హీరో!
సాక్షి, ముంబై: భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు సామాన్య ముంబైకర్లే కాదు.. నగరంలో నివసించే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అష్టకష్టాలు పడ్డారు. రోడ్ల మీద, వీధుల్లో నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో తమ వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షం వల్ల ముంబై శాంటా క్రూజ్ ప్రాంతంలో వరదనీటిలో తన కారు చిక్కుకుపోయిందని, దీంతో గత్యంతరం లేక బాంద్రాలోని తన స్నేహితునికి ఫోన్ చేస్తే.. అతను, అతని కూతురు తనను రక్షించడానికి ముందుకొచ్చారని, అతని ఇంట్లో అత్యవసరంగా ఆశ్రయం పొందానని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆపత్కాలంలో ఆదుకోవడం, మానవ సంబంధాలను చాటడంలో ముంబై లాంటి నగరం ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా తాను గమ్యస్థానం చేరలేకపోయానని ఆయన తెలిపారు.
ఇక, మరో బాలీవుడ్ హీరో మాధవన్ సైతం ఇదేవిధంగా వర్షాల్లో కష్టాలు ఎదుర్కొన్నారు. కారులో ఆయన ఇంటికి వెళుతుండగా.. ఇంటికి సమీపంలో కారు చెడిపోయింది. దీంతో మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ ఘటన ఉత్సుకతతోపాటు చిరాకు కలిగించిందని మాధవన్ ట్వీట్ చేశారు. కారు చుట్టూ భారీగా నిలిచిన వరదనీటి వీడియోను ఆయన షేర్ చేసుకున్నారు. హీరోయిన్ హ్యుమా ఖురేషీ కూడా వర్షాల వల్ల రోడ్డు మీద మూడుగంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుపోయినట్టు ట్వీట్ చేశారు.
సోమవారం ముంబై మహానగరాన్ని మహాకుంభవృష్టి ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు ఐదుగురు మరణించారు. ఎంతోమంది ముంబైవాసులు అష్టకష్టాలు పడ్డారు. ఈ రోజు వర్షాలు కాస్తా తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించడంతో పరిస్థితి మెరుగుపడొచ్చునని ముంబై వాసులు ఆశిస్తున్నారు.
My car got stuck in heavy rains. Called a friend. He & his daughter came to my rescue. Now I am in his house.