ఏం మాయ చేశార్రా బాబూ! | ap reorganisation act promises shade away | Sakshi
Sakshi News home page

ఏం మాయ చేశార్రా బాబూ!

Published Fri, Sep 9 2016 7:17 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏం మాయ చేశార్రా బాబూ! - Sakshi

ఏం మాయ చేశార్రా బాబూ!

ఇవి ప్రత్యేక హోదాకు సమానమా..?
సాక్షి, హైదరాబాద్:
ఇదో పచ్చి దగా..! పక్కా మోసం..! ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే మసిపూసి మారేడు కాయ చేసి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఏపీకి జరిగిన అపార నష్టాన్ని పూడ్చడానికి పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు. ఆర్థికలోటు పూడ్చటం, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్‌కు సాయం... అందులో కొన్ని. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి ‘హక్కు’గా సంక్రమించిన ఈ హామీలను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సిఉంది. వీటి అమలుకే కేంద్రం రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్నిటికి కేంద్రం ఇప్పటికే సాయం చేస్తుంది. అయితే విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్ర ప్రజలు, ప్రధాన ప్రతిపక్షం ఉద్యమించారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా కావాలంటూనే, అంతకు మించిన సాయం చేస్తే వద్దంటామా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఐదుకోట్ల ఆంధ్రుల ఆశలను అడియాశలు చేస్తూ... విభజన చట్టం ద్వారా సంక్రమించిన హక్కులనే వల్లె వేస్తూ అవేవో తాము కొత్తగా ఇచ్చినట్లు ప్రకటించి, దాన్ని ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా చిత్రీకరించింది.  కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఎలాంటి సాయం ప్రకటించకపోయినా... ఇచ్చిన హామీలను సైతం ఎన్నేళ్లలో పూర్తి చేస్తారనే స్పష్టత లేకపోయినా... ఆ ప్రకటనను సీఎం స్వాగతించడం గమనార్హం. విభజన చట్టంలోని హామీలను, వాటి అమలు  విధానాన్ని, తాజాగా కేంద్రం చేసిన ప్రకటనలోని ఆంతర్యాన్ని గమనిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రజలను ఎలా వంచిస్తున్నాయో అర్థమవుతుంది.
 
రెవెన్యూ లోటు...
విభజన చట్టంలో ఏముంది?
విభజన వల్ల భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు.  జూన్ 2వ తేదీ నుంచి మార్చి 31, 2015 వరకు రూ.16.078.67 కోట్లు రెవెన్యూ లోటు  ఏర్పడినట్లు అకౌంటెంట్ జనరల్ నివేదిక కేంద్రానికి సమర్పించారు.

మూడేళ్లలో కేంద్రం ఏమిచ్చింది?
 విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2303, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1176.50 కోట్లు... మొత్తంగా మూడేళ్లలో రూ.3,979.50 కోట్లు విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది?
2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు రాజీపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన ఆధారంగా స్పష్టం అవుతోంది. రూ.16.078.67 కోట్లు రెవెన్యూ లోటు  ఏర్పడినట్లు అకౌంటెంట్ జనరల్ తేల్చగా కేంద్రం మూడేళ్లలో కేవలం రూ.3,979.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ మొత్తాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం ఆడంబరాలకు వినియోగించి, తప్పుడు లెక్కలు చెప్పింది.
తాజాగా ఏం చెప్పారు?
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014-15లో రెవెన్యూ లోటును ప్రామాణికమైన ఖర్చును పరిగణనలోకి తీసుకుని కేంద్రం చెల్లిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే రూ.3,979 కోట్లు చెల్లించాం. మిగిలినది వాయిదాల కింద చెల్లిస్తాం.
లోటు భర్తీలోనూ కోతేనా?
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఇప్పటికి కేవలం రూ.3,979.50 కోట్లు మాత్రమే విడుదల చేసిన కేంద్రం మిగతా ఎంత మొత్తాన్ని ఇస్తారో తాజా ప్రకటనలో స్పష్టం చేయలేదు.
 
రాజధాని భవనాల వివరాలు...
విభజన చట్టంలోని సెక్షన్-94 ప్రకారం నూతన రాజధానిలో కనీస అత్యవసర మౌలిక సదుపాయాల నిర్మాణాలైన రాజభవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తుంది. అందుకోసం అవసరమైతే అటవీ భూములను డీనోటిఫై చేస్తామని పేర్కొంది.
మూడేళ్లలో ఏ మేరకు నిధులొచ్చాయి?
రాజధానిలో నిర్మాణాలకు గత ఏడాది వరకు కేంద్రం రూ.1050 కోటు,్ల ఈ ఏడాది రూ.450 కోట్ల  ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తానికి వినియోగ పత్రాలు సమర్పిస్తేనే 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని షరతు విధించింది.
తాజాగా ఏం చెప్పారు?
ఏపీ నూతన రాజధాని కోసం ఇప్పటికే రూ.2,500 కోట్లు చెల్లించాం, మిగిలిన రూ.1000 కోట్లను కూడా చెల్లిస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం...
రాజధాని నిర్మాణం కోసం రూ. 15,175 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. కేంద్రం ఇప్పటివరకూ రూ.1,050 కోట్లు విడుదల చేయగా రాష్ర్ట ప్రభుత్వం వాటిని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట దుబారాగా ఖర్చు చేసింది. విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఇచ్చిన రూ. 1000 కోట్లు నిధులను కూడా రాజధాని ఖాతాలో రాసేసినా ప్రశ్నించే ధైర్యం చేయడంలేదు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పకపోవడం... శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తాత్కాలిక భవనాల నిర్మాణం పేరిట దుబారా ఖర్చులు చేస్తుండటంతో కేంద్రం నిధుల విడుదలలో కోత వేసింది.
ఎన్నేళ్లకు పూర్తయ్యేను?
రాజధాని నిర్మాణానికి రూ.15,175 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా కేంద్రం కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే సహాయం అందిస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే రాజధాని భవనాల నిర్మాణంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది.
 
ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధి
విభజన చట్టంలోని సెక్షన్-46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. సెక్షన్ 94 (2) ప్రకారం కేబీకె, బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని పేర్కొంది.
మూడేళ్లలో ఎన్ని నిధులొచ్చాయి?
జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేంద్రం 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 350 కోట్ల చొప్పున విడుదల చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 350 కోట్లు సాయం ప్రకటించింది. అయితే గతంలో ఇచ్చిన రూ.700 కోట్లకు వినియోగ పత్రాలను సమర్పించాకనే ఈ నిధులను ఇస్తామని షరతు విధించింది.
అరుణ్ జైట్లీ ఏం చెప్పారు?
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు ఇప్పటికే రూ.1,050 కోట్లు విడుదల చేశాం. రానున్న సంవత్సరాల్లో మరో రూ.1,050 కోట్లు సహాయం అందిస్తాం.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం
రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధికి రూ.7,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే ఆ మేరకు నిధులు సాధించలేక రాష్ర్ట ప్రభుత్వం చతికిలబడిపోయింది. తాజాగా కేవలం రూ.2,100 కోట్లు మాత్రమే సహాయం అందిస్తామని కేంద్రం స్పష్టంచేసినా రాష్ర్ట ప్రభుత్వం కిమ్మనడంలేదు.
 
పారిశ్రామిక రాయితీలు
విభజన చట్టం సెక్షన్ 94(1) ప్రకారం పారిశ్రామిక ప్రగతికి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక చర్యలతో పాటు పన్నుల రాయితీలు ఇస్తుంది. ఆ మేరకు ఇప్పటివరకు అదనంగా 15 శాతం యాక్సిలేరేటెడ్ డిప్రియేషన్, 15 శాతం అదనపు కేపిటల్ అలవెన్స్‌ను ఐదేళ్ల పాటు ఇచ్చింది. తాజాగా అరుణ్ జైట్లీ ఇవే మాటలను వల్లె వేశారే తప్ప కొత్తగా ప్రకటించిందేమీ లేదు.
 విభజన చట్టంలోని హామీల మేరకు
 రాష్ట్రానికి రావాల్సిన నిధులు... (రూ.కోట్లలో)
 2014-15 ఆర్థిక లోటు పూడ్చటం    16,078.67
 రాజధాని నిర్మాణం కోసం    15,175
 పోలవరం ప్రాజెక్టు కోసం    20,010
 వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి    7,000
 జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు    9,580
 పరిశోధన, శిక్షణ సంస్థల ఏర్పాటుకు    8,000
 ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్థిక లోటును పూడ్చడానికి     46,600
 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు    32,809
 మొత్తం     1,53,674
 ఇవికాక ఆయా పథకాలకు కేంద్రం నుంచి రావాల్సినవి     45,000
 మొత్తంగా కలిపి    1,96,674
 
విద్యా, శిక్షణ, పరిశోధనా సంస్థలు...
విభజన చట్టం 13వ షెడ్యూల్ సెక్షన్ 93లో రాష్ట్రంలో పలు జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పుతామన్న హామీ ఉంది. ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐఐటీ, వ్యవసాయ యూనివర్సిటీ, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం ఎన్‌ఐడీఎంల ఏర్పాటుకు రూ.9,580 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. అలాగే షెడ్యూలు 9, 10 లో పేర్కొన్న శిక్షణ, పరిశోధన సంస్థలకు మరో రూ.8,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. వీటిలో కొన్నిటిని మంజూరు చేయగా... తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఎప్పుడిస్తారో, మిగతా సంస్థలను ఎప్పుడు మంజూరు చేస్తారో జైట్లీ ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు. విభజన చట్టంలో పేర్కొన సంస్థల పేర్లు చెప్పారే తప్ప కొత్తగా ఒక్క సంస్థనూ ప్రకటించకపోవడం గమనార్హం.
 
మౌలిక సదుపాయాల కల్పన...
విభజన చట్టం 13 షెడ్యూల్ సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పలు ప్రాజెక్టులను ప్రకటించారు. వాటి ఏర్పాటుకు రూ.46,600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఆరు నెలల్లో నివేదిక ఇస్తామని పేర్కొనగా.. మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. దుగరాజపట్నం ఓడరేపు తొలిదశ 2018నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నప్పటికీ ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా అరుణ్ జైట్లీ ప్రకటనలోనూ ఈ అంశాలపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను ఇంకా పరిశీలిస్తున్నామని ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు రూ.రెండు లక్షల కోట్లు అవసరమని అంచనా వేయగా... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రత్యేక హోదాకు సమానమైన సహాయం’ ఆ మేరకు లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement