‘గతిలేకనే బీజేపీతో బాబు తెగతెంపులు’ | KVP Wrote A Letter To Chandrababu Over AP Special Status | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 29 2018 6:00 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

KVP Wrote A Letter To Chandrababu Over AP Special Status - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై టీడీపీ ఆడుతున్నపూటకో డ్రామాలు, మోసపూరిత దీక్షల గురించి ఎండగడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేవీపీ పేర్కొన్న ముఖ్యాంశాలు..
 
పోరాటయోధుడిగా చిత్రీకరించుకోవడానికే..
‘గత నాలుగు సంవత్సరాలుగా అధికార మత్తులో, మోడీ మాయలో ఉన్న మీరు, ఎన్నికలు ముంగిట్లో కొచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొచ్చి హోదా ఉద్యమంలోకి హఠాత్తుగా ఊడిపడి పొద్దెరుగకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. గతిలేకనే బీజేపీతో తెగతెంపులు చేసుకొన్న మీరు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని గురించి కేంద్రతో పోరాటం చేస్తున్న పోరాటయోధుడిగా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూపడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే మీరు, మీ పార్టీ గత నాలుగు నెలలుగా చేస్తున్న పోరాటాన్ని "స్వతంత్ర ఉద్యమ పోరాటం" స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మీ సోత్కర్ష, సెల్ఫ్ డబ్బా శృతిమించి అసహజంగా కనిపించి జనానికి రోత పుట్టిస్తున్నాయి.

బరువు తగ్గడానికే దీక్షలు
మీ పార్టీ వారు చేస్తున్న దీక్షలు, ధర్నాలు "బరువు తగ్గడానికి" చేస్తున్న ప్రయోగాలేనని, ఇక మీ నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాటా దీక్షలు.. ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మాయ చేయడానికి చేస్తున్న మీ ప్రచార ఆర్భాటాలేనని "సోషల్ మీడియా" కోడై కూస్తున్న విషయం మీకు తెలియనిది కాదు. అసత్య ప్రచారాలు చేస్తూ, చివరకు ఆ అసత్యాలని నిజాలుగా జనాన్ని నమ్మించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు జనం విషయంలో ఎలా పనిచేస్తున్నాయో తెలియదు గాని.. మీ విషయంలో,మీ భజనబృందాల విషయంలో చక్కగా పనిచేస్తున్నాయి.

దీక్షల కోసం కోట్ల ఖర్చు
ఇక మీ అసత్య ప్రచారాలకు పరాకాష్ట నిన్న "ఒంగోలు ధర్మ పోరాట దీక్ష" సభలో మీ ప్రసంగం. నాలుగేళ్లు, మీ మార్గదర్శకత్వంలో, మీ దిశానిర్దేశానికి అనుగుణంగా, మీకు మాట రాకుండా.. ప్రజా ప్రయోజనాలు, విభజన హామీలు గాలికి వదిలి.. తమ సొంత పనులు చక్కబెట్టుకొంటూ.. పార్లమెంట్ సభ్యులకు సన్మానంతో మొదలైన మీ సభ.. ఆద్యంతం అసత్యాలతో, అర్ధసత్యాలతో పాటు.. ఆత్మ స్తుతి.. పరనిందలకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. 

ఈ సభ వల్ల ప్రజలకు ఏ మాత్రం లాభం లేకపోగా.. దీక్షకు మీరు అట్టహాసంగా చేయించిన ఏర్పాట్ల వల్ల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజానాపై పడింది. అయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను మరోసారి బురిడీ కొట్టించి ఎలా అయినా అధికారం సంపాదించాలని మీరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి.. వాస్తవాలను, ముఖ్యంగా విభజన హామీల సాధన విషయంలో మీ ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడంతో పాటు.. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ విభజన హామీల విషయంలో చేసిన ప్రయత్నాలు మీకు తెలిసినా.. మరిచిపోయినట్లు నటిస్తున్న మీకు మరోసారి గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం.

విభజన చట్టం అమలు గురించి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్సే..
నిజానికి మార్చి2, 2014న కేంద్ర కేబినెట్ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం మరియు ఆంధ్రకు ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా.. ఈ రెండు అంశాలను ఆర్డినెన్సు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినా.. న్యాయశాఖ అభ్యంతరాల నేపథ్యంలో ఇవ్వకపోవడం వల్ల.. అదే ఆర్డినెన్సును ఎన్డీయే ప్రభుత్వం మే28 న జారీ చేసినా.. దాంట్లో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం గుర్తించి.. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జూన్‌2, 2014నే ప్రధానికి లేఖ రాశారు.

ఎన్నికలలో గెలిచి, ప్రమాణస్వీకారం, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత అట్టహాసంగా చేయాలి అని మీరు గణించుకొంటున్న రోజులవి. మీకు గుర్తుండే ఉంటుంది. ఇక ఆరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ.. మొన్న లోక్సభలో అవిశ్వాసం, రాజ్యసభలో స్వల్ప విరామంలో చర్చ వరకు.. రాష్ట్రస్థాయిలో, కేంద్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వవలసినదేనని పోరాటం చేస్తూనే ఉన్నది.

ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలను తేదీలవారీగా మీకు పంపుతున్నాను. ఒకసారి పరిశీలించండి. మీ భ్రమలు తొలిగే అవకాశం ఉన్నది. ఇక ఆ సభలో మీ ప్రవచనాలలో భాగంగా.. అనేక పార్టీల మద్దతు మీరు "కష్టపడి" కూడగట్టినట్లు పెద్ద చిట్టా చదివారు. కానీ మీరు చెప్పిన పార్టీలన్నీ.. రాజ్యసభలో నేను ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశ పెట్టిన "ప్రైవేట్ మెంబెర్ బిల్"కు అనుకూలంగా ఓటు వేయడానికి ఏప్రిల్ 2016 లోనే, అంటే రెండు సంవత్సరాలు క్రితమే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాల వల్ల సిద్ధం అయ్యారన్న విషయం మీరు ఉద్దేశ్యపూర్వకంగానే మర్చిపోయారు.

అంటే.. రెండు సంవత్సారాల క్రితమే.. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. జాతీయ స్థాయిలో 14 పార్టీలు ఆంధ్రకు సహకరించడానికి  ముందుకొస్తే, మీరు మాత్రం మోడీ మోజులో అప్పట్లో.. "ప్రత్యేకహోదా సంజీవని కాదు.. ప్రత్యేకహోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి".. అంటూ చిలకపలుకులు పలికారు. ఇక ఆ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా, ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్ కు అనుకూలంగా తప్పనిసరిగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు విప్ జారీచేసి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని చూస్తే.. మీరు మాత్రం మీ ఎంపీలకు సభ జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.

ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్నారు
ఇక జైట్లీ గారు.. ప్రైవేట్ మెంబెర్ బిల్లు మనీ బిల్లు అని ప్రకటించగానే.. మీ సభ్యులు మీ ఆదేశాలకు అనుగుణంగా బల్లలు చరిచి ఆనందం వ్యక్తం చేశారు. ఇక జూన్‌4, 2017న రాహుల్ గాంధీ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీల జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో సంఘీభావం వ్యక్తం చేయడానికి గుంటూరు వస్తే.. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తూ, కాన్వాయ్ లపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసరమని, ఆ సభను భగ్నం చేయమని, రాహుల్ గాంధీతో సహా ఇతర నాయకుల ఫ్లెక్సీలను చించమని, పార్టీనాయకులకు, ప్రభుత్వ అధికారులకు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు ఇచ్చారు మీరు. 

"ప్రత్యేకహోదా కంటే మెరుగైన ప్యాకేజిని సాధించానని" శాసన సభ సాక్షిగా చెప్పిన మీరు.. "ప్రత్యేక హోదా అంటే జైలుకే" అంటూ బెదిరించిన మీరు.. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రేమీ లేనట్లు చిత్రీకరిస్తూ.. కృత్రిమ కన్నీరు కారుస్తూ.. ముక్కు చీదడం ప్రజలకు వెగటు పుట్టిస్తున్నది. 

అవిశ్వాసానికి కాంగ్రెస్‌ మద్దతు..
ఇక మొన్న కేంద్రంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. కేవలం అందరికంటే ముందు నోటీసు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో మీ పార్టీ నోటీసు ను ముందుగా చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక అవిశ్వాస తీర్మానం పై చర్చ చేపట్టడానికి కూడా మీకున్న సంఖ్యాబలం సరిపోదని తెలిసినా.. ఆ అవిశ్వాస తీర్మానానికి మీరే కారణం అయినట్లు చెప్పుకోవడం.. ఇక కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకొని అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిందని చెప్పడం.. మీ అవకాశవాదానికి పరాకాష్ట.

ఊసరవెల్లి కంటే ఘోరంగా..
నిజానికి కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరగకూడదనే చిత్తశుద్ధితోనే మొదటినుంచి వ్యవహరిస్తున్నది. తన మనసు ఎప్పుడు మార్చుకోలేదు.. మాట ఎప్పుడు మార్చలేదు.. కానీ ప్రత్యేక హోదా విషయంలో ఊసరవెల్లి కంటే ఘోరంగా, వేగంగా రంగులు మార్చింది.. మాటలు మార్చింది మీరే.. ఈ విషయం మీకు గుర్తు లేకపోతే..  "ప్రత్యేక హోదా విషయంలో మొదటినుంచి మన స్టాండ్ ఎలా ఉన్నది.. మన ఏ విధంగా ముందుకు పోయాం.. ఒక్కసారి చెప్పండి".. అని మీ సీపీఆర్ఓనో, మీ మీడియా సలహాదారునో ఒక్కసారి అడగండి..  వీడియో సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతారు. లేదంటే.. "గత నాలుగేళ్లు గా అధికారం తలకెక్కి.. ప్రజలను మర్చిపోయాను.. ఇప్పుడు ఎన్నికల వస్తుండడంతో మళ్ళీ మీరు గుర్తు వచ్చారు" అని తప్పును నిజాయతీగా ప్రజలముందు ఒప్పుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించకండి.

ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపండి..
నిజంగా.. విభజన హామీల సాధన పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయ్యుంటే.. దీక్షల పేరుతో, వేదికలెక్కి.. మైకులు పట్టుకొని ఇచ్చే ఉపన్యాసాలు ఆపి,  "అవసరమైతే.. న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని".. ఉత్తర కుమార ప్రగల్భాలు అపి.. అవసరం వచ్చింది అని గ్రహించి.. ప్రభుత్వ పరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ముందు, విభజనచట్ట అమలుపై వివిధ కోర్టులలో ఉన్న కేసులలో ప్రభుత్వం తరుపున వాస్తవాలు వివరిస్తూ కౌంటర్లు వేయించి.. ఈ కేసులను ప్రజా ప్రయోజనార్ధం దృష్ట్యా త్వరితగతిన పరిష్కరించమని కోర్ట్ లను కోరండి.  

మీ నిజాయితీని నిరూపించుకోండి. 
దీక్షల పేరిట  ప్రజాధన దుర్వినియోగాన్ని ఆపండి. హోదాపై మీ నిజాయితినీ నిరూపించుకోండి. ప్రత్యేక హోదాతో సహా ఇతర విభజన హామీల సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను, పోరాటాన్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్ పాత్రను తక్కువచేసి చూపేలా గోబెల్స్ ప్రచారాలు మానుకోండి’ అంటూ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement