'చంద్రబాబూ.. మద్దతు ఇవ్వండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 13న రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు, సవరణల విషయంపై తాము ఓటింగ్కు పట్టుబడతామని, తెలుగుదేశం పార్టీ సభ్యులను హాజరుపరిచి బిల్లుకు మద్దతు తెలపాలని కేవీపీ కోరారు. అలాగే బీజేపీ, ఎన్డీయే పక్షాల మద్దతు కూడగట్టేందుకు కృషిచేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు.
విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన, చట్టంలో పొందుపరిచిన రాయితీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. దీంతో పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ గతేడాది జూలైలో రాజ్యసభలో తాను ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. గత నెల 29న ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదనే అభిప్రాయం వచ్చేలా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి మాట్లాడారని గుర్తుచేశారు. దీంతో తాము ఓటింగ్కు పట్టుబడుతున్నట్టు కేవీపీ తెలిపారు.