సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే ఆంధ్రా ద్రోహులు అన్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు హోదా గుర‍్తుకు వచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని, ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు చిత్రీకరించడంలో ఆయన సమర్థుడని ఎద్దేవా చేశారు. కేవీపీ రామచంద్రరావు బుధవారమిక‍్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట. నాకు నా పార్టీకి మధ్య అగాధం సృష్టించొద్దు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం బద్ధుడినై ఉన్నా. ఆ విషయం పార్టీకి పూర్తిగా తెలుసు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అనేక సంవత్సరాలుగా పార్లమెంట్‌లో ఉద్యమిస్తున్నా. ఏపీ ప్రయోజనాల కోసం రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఫణంగా పెట్టా. సభలో గంటల తరబడి నిలబడి అస్వస్థతకు గురయ్యా. పెయిన్ కిల్లర్స్ స్ప్రే చేసుకొని సభలో నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నానని రాజ్యసభ చైర్మన్ సైతం అన్నారు.
ఎన్నో ప్రలోభాలు, ఇబ్బందులు ఎదురైనా చిన్నతనం నుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాను. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా. కాంగ్రెస్ పార్టీలోనే నా శేష జీవితం. మూడేళ్ల క్రితమే మేము రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక హోదా కోరాం. మూడేళ్ల క్రితం కోటి సంతకాలు సేకరించాం. హోదాపై చంద్రబాబు ఇప్పుడు కళ్లు తెరిచారు. ఆయనది ఓవరాక్షన్. నరేంద్ర మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. హోదాపై నా ప్రైవేట్ మెంబర్ బిల్లుకు 14 పార్టీలు మద్దతు పలికాయి. ఆ బిల్లుకు మద్దతిచ్చే పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేరింది. పచ్చి అబద్ధాలను నిజాయితీగా చెప్పడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు అధిష్టానం పూర్తి భరోసా ఇస్తుంది. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్ధతుతోనే అన్ని కార్యక్రమాలు చేశాం. మా మధ్య ఎలాంటి అపార్థాలు లేవు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment