సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంతకాలం సమ్మె చేసి ఏం సాధించాం? జీతాలతో పాటు పిల్లల భవిష్యత్‌ను పణంగా పెట్టి సమ్మె చేశాం. ఇప్పుడు ఆశించిన ఫలితం రాకుండానే విరమిస్తే.. ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? ఇంతకాలం స్పష్టమైన హామీ వస్తేనే విరమిస్తామన్నాం. ఇప్పుడు ఎలాంటి హామీ లేకుం డానే.. సమ్మె ఎందుకు విరమించాలి? ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో ఎందుకు విఫలమయ్యాం? ప్రజలు స్వచ్ఛందంగా చేసిన ఉద్యమాన్ని పెట్టుబడిదారీ ఉద్యమం అని కేంద్ర మంత్రులే అంటుంటే ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నాం? ఒకసారి ఎంపీల రాజీనామాలు కోరుతాం. మరోసారి వద్దంటాం. శాసనసభలో తీర్మానం ఓడిద్దామంటాం. అసలు శాసనసభకు తీర్మానమే రాదంటే.. మరేదో అంటాం. ఎందుకు మనకు స్పష్టత లేదు? అన్ని వ్యవస్థలను కలుపుకొని పోవడంలో ఎక్కడ విఫలమయ్యాం? ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించి సమ్మె విరమిస్తే ఇప్పుడు జనం ఛీ కొట్టరా? ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాకట్టుపెడితే ఎలా?’’ సీఎంతో చర్చలకు ముందు గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో సమ్మెకు నేతృత్వం వహించిన ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఎదుర్కొన్న ప్రశ్నాస్త్రాలివి. ప్రారంభం నుంచీ వాడివేడిగా సాగిన సమావేశంలో 52 సంఘాల నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా అశోక్‌బాబు మాట్లాడుతూ.. సమ్మె వల్ల చిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించారు. సమ్మెను తాత్కాలికంగా విరమించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా? అనే అంశం మీద అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. అనంతరం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యమ నిర్వహణలో రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లడంలో విఫలం కావడానికి మన వైఖరే కారణమని విమర్శించారు. ఉద్యోగులుగా తమ శక్తి ఎంత అనే విషయం స్పష్టంగా తెలిసినా... ఉద్యమంలో చేరేందుకు ముందుకొచ్చిన పార్టీలను అడ్డుకుని నష్టపోయామన్నారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చిన తర్వాత ఓడించడానికి ప్రయత్నించడం కంటే.. ఇప్పుడే శాసనసభను సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతున్న పార్టీకి మద్దతు ఇచ్చి ఉంటే ఉద్యమం మరింత ఉధృతంగా సాగడానికి, ఉద్యమం నుంచి ఉద్యోగులు నిష్ర్కమించడానికి మేలైన మార్గం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుంటే మెరుగైన ఫలితం వచ్చి ఉండేదన్నారు.
వెంకటేశ్వర్లు వాదనతో దాదాపు ఉద్యోగ సంఘాల నేతలంతా ఏకీభవించారు. విభజనపై ముఖ్యమంత్రికే స్పష్టత లేకుంటే తమకు వచ్చే హామీలో స్పష్టత ఏమి ఉంటుందని పలువురు నేతలు నిలదీశారు. సీఎం ఇచ్చే హామీని చూపించి సమ్మె విరమించడం కంటే.. ఉద్యోగులుగా తమ శక్తి ఇంతేనని, సమ్మె కొనసాగించలేమని, తమను క్షమించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసి సమ్మె విరమించడం మంచిదన్నారు. దాంతో ఉద్యమం ప్రజలు, రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లే అవకాశమైనా ఉందన్నారు. సమ్మె విరమణకు అదే గౌరవ ప్రమదమైన ముగింపు అవుతుందన్నారు. విభజన ప్రక్రియ వేగంగా సాగుతున్న సమయంలో సీఎం హామీతో సమ్మె విరమిస్తే.. ఉద్యోగులు అమ్ముడుపోయారని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందన్నారు. ఒకానొక దశలో సమావేశంలో అశోక్‌బాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగులు లేవనెత్తిన పలు అంశాలకు అశోక్‌బాబు వివరణ ఇస్తూ.. సీమాంధ్రలో అన్ని వ్యవస్థలు విఫలమైన తర్వాతే ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగాయని, సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నందున ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోమా?
Published Fri, Oct 18 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement