
జయ మృతిలో కుట్ర లేదు
► లండన్ డాక్టర్ రిచర్డ్ బీల్
► వైద్యం ఖర్చు 5.5 కోట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిలో కుట్ర కోణం, రహస్యం ఏమీలేదని లండన్ వైద్యుడు రిచర్డ్ బీల్ స్పష్టం చేశారు. ఆమెపై విషప్రయోగం జరగలేదని, గుండెపోటుతోనే జయ మృతి చెందారని తేల్చిచెప్పారు. జయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి అపోలో యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం, రిచర్డ్ బీల్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జయ మరణంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్న దృష్ట్యా వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం కోరడంతో ఇక్కడికి వచ్చానని బీల్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ బీల్‌తో పాటు అపోలో వైద్యుడు డాక్టర్ బాబు అబ్రహాం, ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాలు..
♦ గతేడాది సెప్టెంబర్ 22న జయలలితను ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు ఆమె స్పృహలోనే ఉన్నారు. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే నియంత్రించలేని స్థాయిలో డయాబెటిస్ ఉంది.
♦ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత మెరుగైన చికిత్స అందించాం. చికిత్స వివరాలను శశికళకు, ప్రభుత్వ పెద్దలకు వివరించాం. ఒక దశలో ట్రీట్‌మెంట్ కోసం లండన్ కు తీసుకెళ్లాలలనుకున్నాం.. కానీ ఆమె శరీరం అందుకు సహకరించలేదు.
♦ జయలలిత కాళ్లు తొలగించలేదు.
♦ బాగా కోలుకున్నారనుకున్న దశలో గుండెపోటు రావడంతో జయ కన్నుమూశారు. ఇది మేం ఊహించలేదు.
♦ భౌతికకాయం చెక్కు చెదరకుండా ఉండేందుకు డిసెంబర్ 5వ తేదీ రాత్రి 12.20 గంటలకు 5.5 లీటర్ల ప్రత్యేక ద్రవాన్ని ఆమె శరీరంలోకి పంపించాము. వీవీఐపీల భౌతికకాయాలకు ఇలా చేయడం సాధారణమే. ఎంజీఆర్ పార్థివదేహానికి కూడా చేశారు.
♦ చికిత్సకు అయిన రూ. 5.5 కోట్లను జయ కుటుంబీకులే చెల్లించారు.
♦ ఉప ఎన్నికల్లో బీ ఫారంలపై జయ వేలిముద్ర వేసినపుడు డాక్టర్ బాలాజీ, డాక్టర్ అబ్రహం సంతకం చేశారు. అపుడు ఆమె స్పృహలోనే ఉన్నారు.