కేజ్రీవాల్‌కు మరో ‘పదికోట్ల’ ఝలక్!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఝలక్ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా మరోసారి రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ వేశారు. ఇప్పటికే కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈ దావాపై ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రాం జెఠ్మలానీ తనను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారని, ఓపెన్ కోర్టులో వాదనల సందర్భంగా తనను దూషించారని పేర్కొంటూ రూ. 10 కోట్ల మరో పరువునష్టం దావాను జైట్లీ దాఖలు చేశారు.
ఈ నెల 15న, 17న ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ రాం జెఠ్మలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఓపెన్ కోర్టులో ఆయన చేసిన దుర్భాషలను ఆర్డర్ షీట్‌లో సైతం రికార్డు అయ్యాయని, అందుకే మరో పరువు నష్టం దావాను జైట్లీ వేసినట్టు ఆయన తరఫు న్యాయవాది మనిక్ దోగ్రా తెలిపారు. జైట్లీని ఉద్దేశించి జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కోర్టు వీటిని ‘స్కాండలస్’గా పేర్కొంది. ఢిల్లీ క్రికెట్ సంఘం కుంభకోణం విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి పరువునష్టం కలిగించారని కేజ్రీవాల్‌తోపాటు మరో ఐదుగురు ఆప్ నేతలపై జైట్లీ గతంలో పరువునష్టం దావా వేశారు.