
తెలుగు బస్సులకు అరుణాచల్ బ్రేక్
► ఆ రాష్ట్రంలో రిజిస్ట్రర్ అయిన బస్సు పర్మిట్లు రద్దు
►తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న వెయ్యి ట్రావెల్ బస్సులపై వేటు
►ఇకపై పెనాల్టీలు ఉండవు.. జప్తు చేస్తామంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: నిబంధనలను బేఖాతరు చేస్తూ చట్ట విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు పర్యాటక రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ షాకిచ్చింది! రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెయ్యి బస్సులు రోడ్డెక్కకుండా చేసింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కంగుతిన్నాయి.
ఇదీ సంగతి..
ఆదాయమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలు ఏమీ చేయలేకపోగా చిన్న రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ ముప్పు తిప్పలు పెడుతోంది. పర్యాటక రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో 2+1 విధానంతో స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతోపా టు పర్మిట్ పన్ను తక్కువగా ఉండటంతో తెలం గాణ, ఏపీలకు చెందిన పలు ట్రావెల్స్ యజమానులు తమ బస్సులను ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అక్కడ్నుంచే పర్మిట్ పొంది ఇక్కడ తిప్పుతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ నిబం ధనల ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని పర్మిట్ పొందిన బస్సులు కనీసం నెలలో ఒకసారి ఆ రాష్ట్రానికి వెళ్లాలి.
కానీ ఆ నిబంధనను బేఖాతరు చేయడంతోపాటు స్థాయికి మించి సీట్లు, బెర్తుల సంఖ్య పెంచుకొని ట్రావెల్స్ నిర్వాహకులు భారీగా డబ్బు చేసుకుంటున్నారు. ఏపీకి చెందిన కేశినేని ట్రావెల్స్ ఇటీవల తమ బస్సుల నిర్వహణను నిలిపేసింది. కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ నిర్వాహకులకు ఆ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌కు మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, నిబంధనలను బేఖాతరు చేస్తున్న తీరు పై ఏపీకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు అరుణాచల్‌ప్రదేశ్ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘన నిజమేనని తేల్చి ఆయా ట్రావెల్స్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
నిబంధనలను పాటించని దాదాపు వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేస్తున్నట్లు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖలకు ఆదేశాలను పంపింది. దీంతో తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని 2+1 స్లీపర్ విధానం ఇక్కడ అమలుచేయించుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు యత్నిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆదేశాలు తమ చేతికి అందగానే తక్షణం చర్యలు ప్రారంభిస్తామని తెలం గాణ రవాణాశాఖ జేటీసీ రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు.
ఇంతకాలం పెనాల్టీతో సరి... ఇక జప్తే..
అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడి నిబంధనలకు విరుద్ధంగా 2+1 స్లీపర్ విధానంతో తిరుగుతున్న బస్సులపై ఇప్పటివరకు తెలంగాణ రవాణా శాఖ పెనాల్టీలు మాత్రమే విధిస్తూ వచ్చింది. అడపాదడపా పెనాల్టీలు విధించడం రవాణశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి అలవాటుగా మారింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేయడంతో ఈ బస్సులు తెలంగాణ పరిధిలో తిరగడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ఆ బస్సులు కనిపిస్తే జప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.