'వచ్చే ఎన్నికల్లో 35 స్థానాలు గెలుస్తాం'
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం రెండు చోట్ల అధికారం కైవసం చేసుకునే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పంజాబ్ లో ఆప్ గాలి వీస్తున్నట్లు ముందస్తు సర్వేలు చెబుతుండగా, చిన్నరాష్ట్రం గోవాలోనూ సత్తాచాటాలని చీపురు పార్టీ భావిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల గోవా పర్యటనకు వచ్చారు. మంగళవారం ఉదయం పణజి విమానాశ్రయంలో ఆప్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి కేజ్రీవాల్ నేరుగా మత్స్యకారులు నివసించే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయనకు అరుదైన స్వాగతం లభించింది. తాము సాంప్రదాయంగా భావించే పూల కిరీటంతో మత్స్యకారులు కేజ్రీవాల్ ను సన్మానించారు. పూలవెలుగులో మెరిసిపోతూ ఆయన మీడియాతో మాట్లాడారు.
'గోవాలో బీజేపీ పాలన వల్లే అవినీతి పెరిగిపోయింది. ఆ కుళ్లును చీపుర్లతో కడిగేయడానికే సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 35 స్థానాలను గెలుచుకుంటాం'అని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి 2017 మార్చితో గడువుతీరనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ ల అసెంబ్లీ ఎన్నికలతోపాటే గోవా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. గత లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.