
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
సామాన్యుడు చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. చీపురుకట్టతో విప్లవం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకరం చేశారు.
సామాన్యుడు చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. చీపురుకట్టతో విప్లవం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకరం చేశారు. మంత్రులుగా తాను ఎన్నుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలు వెంటరాగా.. 11.55 నిమిషాలకు వేదికపైకి వెళ్లారు. ముందుగా పోలీసు బ్యాండుతో జనగణమణ ఆలపించగా.. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి పేరుమీదే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మనీష్ సిసోదియా, మిగిలిన ఐదుగురు మంత్రులతో కూడా నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, గిరిషీ సోని, సత్యేంద్ర కుమార్ జైన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాఖీ జైన్ మాత్రం ముందుగా భారత్ మాతాకీ జై, వందే మాతరం అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు. ఆ తర్వాతే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. గిరీష్ సోనీ మాత్రం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పలు సందర్భాలలో కొంత తడబడ్డారు. ఆయనతో ప్రమాణం చేయించేటప్పుడు నజీబ్ జంగ్ కూడా ఒక సారి తడబడ్డారు. అందరికంటే చివరిగా సౌరభ్ భరద్వాజ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాంలీలా మైదాన్ ప్రజలు, అభిమానులతో కిక్కిరిసింది. పలువురు జాతీయ జెండాలు, చీపురు కట్టలతో మైదానానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరికీ ప్రత్యేక పాస్లు ఇవ్వకపోవడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.