
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. 26న ప్రమాణ స్వీకారం
సామాన్యుడు ఢిల్లీ గద్దె ఎక్కుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26వ తేదీ గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సామాన్యుడు ఢిల్లీ గద్దె ఎక్కుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26వ తేదీ గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్మంతర్లోనే ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పదిహేను సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమైంది.
మొత్తం తాను గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే చేయించి మరీ తాము అధికారం చేపట్టాలో వద్దో ఆప్ నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పార్టీకి మద్దదు ఇచ్చిందని అంటున్నారు. గతంలో ప్రైవేటు కంపెనీలకు దన్ను ఇచ్చిందంటూ షీలా దీక్షిత్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటుచేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాలన్నీ ఆచరణ సాధ్యమేనని, తాము షరతులతో కూడిన మద్దతునే ఆ పార్టీకి ఇస్తున్నామని షీలా దీక్షిత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ విధానాలకు తప్పనిసరిగా అంగీకరించాలని, ఒకవేళ మధ్యలో కూలదోసే ప్రయత్నం చేసినా కూడా అది తమకు సానుభూతి తెస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు.