రూ. 3,000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) చెల్లింపుల కేసులో విఫలమైన(డిఫాల్టర్లు) 26 మంది వ్యక్తులు, సంస్థల ఆస్తులను జప్తు(అటాచ్‌మెంట్) చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో విఫలమైన ఎన్‌ఎస్‌ఈఎల్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 3,000 కోట్లుగా అంచనా. కేసుకు సంబంధించి డిఫాల్టర్లు, ఎక్స్ఛేంజీ డెరైక్టర్లు, తదితరులకు చెందిన మొత్తం 212 ఆస్తులను జప్తు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. వీటి విలువ దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుందని తెలిపారు. వీటిలో భాగంగా మొత్తం రూ. 172 కోట్ల నగదు నిల్వలున్న 325 బ్యాంకు ఖాతాలను సైతం జప్తు చేసినట్లు వెల్లడించారు.