బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నివాసంలో దూరి ఆయన్ను కత్తితో పొడిచింది 30 ఏళ్ల బంగ్లాదేశీ(Bangladesh) అని పోలీసులు ప్రకటించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ కాగా.. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు సహాయపడిన మనీ ట్రాన్సెక్షన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.
సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన వెంటనే ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. థానే జిల్లా ఘోడ్‌బందర్ రోడ్డులోని హీరానందానీ ఎస్టేట్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన వారు 24వ తేదీ దాకా కస్టడీకి తీసుకున్నారు. దీని వెనక అంతర్జాతీయ కుట్రను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అయితే, బిజయ్ దాస్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది నెట్టింట వైరల్ అవుతుంది.
పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేయడంతో..
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన తర్వాత బిజయ్ దాస్ తన హోటల్ వద్దకు వచ్చినట్లు మహ్మద్ అనే వ్యక్తి పోలీసులుకు చేరవేశాడని తెలుస్తోంది. అతని తీరు కాస్త అనుమానంగా ఉన్నట్లు అతను పోలీసులకు చెప్పాడట. చాలా ఆందోళనగా తన హోటల్ వద్దకు వచ్చి పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, అందుకుగాను యూపీఐ పేమెంట్ చేశాడని మహ్మద్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. యూపీఐ ద్వారా డబ్బు పంపడంతో నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయడం ఆపై అతను ఠానేలో ఉన్నట్లు తెలుసుకున్నట్లు సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుంచి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపులో దాదాపు 600 పైగానే సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఐదు నెలలుగా ముంబైలో...
బంగ్లాదేశ్‌లోని ఝలోకాటికి చెందిన నిందితుడు ఐదు నెలలుగా ముంబైలో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో ఉద్యోగం, చిన్నాచితకా పనులు చేస్తున్నాడు. దొంగతనం చేయడమే అతని ఉద్దేశమని ప్రాథమికంగా తేలినట్టు పోలీసులు చెప్పారు. ‘‘తాను దొంగతనానికి వెళ్తున్నది ఓ బాలీవుడ్ స్టార్ ఇంట్లోనని అతనికి తెలియదు. ఏడో అంతస్తు దాకా మెట్ల ద్వారా వెళ్లాడు. తర్వాత పైప్ ద్వారా 12వ అంతస్తుకు పాకి కిటికీ గుండా సైఫ్ ఇంటి బాత్రూంలోకి దూరాడు. అందులోంచి బయటికి రాగానే బయట కనిపించిన సిబ్బందిపై దాడి చేసి రూ.కోటి డిమాండ్ చేశాడు. అతన్ని సైఫ్ ముందు నుంచి పట్టుకున్నాడు. దాంతో సైఫ్ వీపుపై పొడిచాడు.
తర్వాత నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేశారు. అతను లోనికి వెళ్లిన దారిలోనే పరారయ్యాడు. ఉదయం దాకా బాంద్రా బస్టాప్‌లో పడుకున్నాడు. లోకల్ ట్రైన్‌లో వర్లీకి చేరుకున్నాడు. అతని బ్యాగు నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు స్వాదీనం చేసుకున్నాం’’ అని వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరుపరిచిన సమయంలో అతని తరఫున వాదించడానికి ఇద్దరు లాయర్లు పోటీ పడటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment