తెలుగు గాయనికి పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్!
- రూ. 20 ఇచ్చి పెద్ద మనస్సు చాటుకున్న ఏటీఎం సెక్యూరిటీ గార్డ్
ప్రముఖ తెలుగు గాయని చిన్మయికి పెద్దనోట్ల రద్దు వల్ల అనూహ్య అనుభవం ఎదురైంది. అమెరికా నుంచి గురువారం ఉదయం భారత్‌లో అడుగుపెట్టిన చిన్మయి దంపతులను పెద్దనోట్ల రద్దు కష్టాలు వెంటాడాయి. పెద్దనోట్ల రద్దును ప్రకటించినప్పుడు వారు అమెరికాలో ఉన్నారు. ఇండియాకు తిరిగొచ్చి చూస్తే వారి వద్ద ఒక్కరూపాయి కూడా చెల్లుబాటు అయ్యే కరెన్సీ లేదు. దీంతో చిన్మయి భర్త రాహుల్ వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి కొత్త కరెన్సీ తీసుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే, ఏటీఎం సెక్యూరిటీ గార్డు ఉదయం 10 గంటల వరకు ఏటీఎంలో డబ్బు లోడ్ చేయరని, అప్పటివరకు ఆగాల్సిందేనని చెప్పాడు. దీంతో నిరాశ చెందిన రాహుల్‌ను ఏటీఎం సెక్యూరిటీ గార్డు తన పెద్ద మనస్సుతో ఆదుకున్నాడు. దంపతులు చాయ్ తాగేందుకు రూ. 20 ఇచ్చాడు. ఈ విషయాన్ని చిన్మయి తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది. మంచి హృదయమున్న మనుష్యులు మనలో ఇంకా చాలామంది ఉన్నారంటూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. పలు సినీగీతాలు పాడిన చిన్మయి సినిమాల్లో సమంతకు డబ్బింగ్ చెప్తూ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే.