అమితాబ్ తనను ప్రశంసించినట్లు నకిలీ వీడియోను సృష్టించి, దాన్ని ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న వాళ్లు అమితాబ్కు క్షమాపణ చెప్పాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు.
బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనను ప్రశంసించినట్లు నకిలీ వీడియోను సృష్టించి, దాన్ని ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న వాళ్లు ఎవరోగానీ.. వాళ్లు వెంటనే అమితాబ్కు క్షమాపణ చెప్పాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. నకిలీ వీడియో సృష్టికర్త వెనువెంటనే అమితాబ్జీకి క్షమాపణ చెప్పాలంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రాశారు.
ఇదే విషయంలో ఇప్పటికే అమితాబ్ కూడా స్పందించారు. తాను అసలు మోడీ విషయాన్ని ప్రస్తావించలేదని, అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు ఎలా పెడతారంటూ ఆయన మండిపడ్డారు. దీన్ని సృష్టించినవాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను మోడీ తరఫున ప్రచారం చేస్తున్నట్లు భావన కలిగిస్తున్న వీడియో యూట్యూబ్లో ప్రసారం కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడ్ ఇండియా ప్రచార కార్యక్రమంలో తాను మాట్లాడిన అంశాలను తీసుకుని ఎవరో ఓ నకిలీ వీడియో తయారుచేశారని, కావాలనే ఇలా మోడీ ప్రచారంలా తయారుచేసి పెట్టారని ఆయన అన్నారు.
అమితాబ్ స్వయంగా ఈ విషయంలో తీవ్రంగా స్పందించడంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సైతం నకిలీ వీడియో సృష్టికర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.