ఆ మంత్రి పిచ్చోడు..!!
లక్నో: తల్లీకూతుళ్ల మీద అమానుషంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆజంఖాన్‌కు పిచ్చెక్కిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని బాధితురాలి మామ మండిపడ్డారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. ‘ఆజంఖాన్‌కు పిచ్చి పట్టినట్టు కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
గత శుక్రవారం రాత్రి బులంద్‌షెహర్ గ్రామం సమీపంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆజంఖాన్ స్పందిస్తూ.. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓట్ల కోసం ప్రజలు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇందుకోసం ముజాఫర్‌నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగి ఉండకూడదు. అధికారం కోసం రాజకీయనేతలు ప్రజల్ని చంపుతారు. అల్లర్లు సృష్టిస్తారు. అమాయకుల్ని బలి తీసుకుంటారు. కాబట్టి ఈ ఘటనలో సత్యం వెలికి తీయాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు.