జేఎం ఫైనాన్షియల్‌లో ప్రేమ్‌జీ వాటా పెంపు!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ... బ్యాంకింగ్ లెసైన్స్‌కోసం పోటీలో ఉన్న జేఎం ఫైనాన్షియల్‌లో అదనపు వాటా కొనుగోలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేఎంలో ప్రేమ్‌జీకి 2.9% వాటా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కింద ప్రేమ్‌జీ ఈ వాటాను కలిగి ఉన్నారు. దీనికి అదనంగా 5% వాటాను తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. నిమేష్ కంపానీ ఆధ్వర్యంలోని జేఎం కొత్త బ్యాంకింగ్ లెసైన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సిటీబ్యాంక్ మాజీ చీఫ్ విక్రమ్ పండిట్‌ను కీలక ఇన్వెస్టర్‌గా ఎంపిక చేసుకుంది కూడా.
అధికారిక సమాచారం లేనప్పటికీ 5% వాటాకు సమానమైన షేర్లను ప్రేమ్‌జీకి కొత్తగా జారీ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా, మార్కెట్ ధర కంటే బాగా అధిక ధరలో ఈ షేర్లను కేటాయించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గడిచిన శుక్రవారం జేఎం ఫైనాన్షియల్ షేరు బీఎస్‌ఈలో 5% జంప్‌చేసి రూ. 28.85 వద్ద ముగిసింది. కుటుంబం తరఫున పెట్టుబడులు చేపట్టే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా గతంలో ప్రేమ్‌జీ జేఎంలో 2.9% వాటాను కొనుగోలు చేశారు.