బేబీ ఉబర్కు ఉబర్ గ్రాండ్ సెలబ్రేషన్స్...
బేబీ ఉబర్కు ఉబర్ గ్రాండ్ సెలబ్రేషన్స్...
Published Fri, Dec 23 2016 2:25 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
న్యూఢిల్లీ : ఉబర్ పేరు పెట్టుకుంటే.. ఇంతమొత్తంలో గిప్ట్ ఇస్తారా? గిప్ట్ ఒక్కటే కాదు. ఫైల్ స్టార్ హోటల్లో గ్రాండ్గా మొదటి బర్త్డే వేడుకలు కూడా. బేబీ బాయ్ను ఆశీర్వదించడానికి ఏకంగా కంపెనీ ఉబర్ కంపెనీ సీఈవో ట్రావిస్ కలానిక్ రావడం, ఆ బాబుకు 12,000 డాలర్ల స్కాలర్షిప్ ఫండ్ను అంటే దేశీయ కరెన్సీ విలువ ప్రకారం రూ.8.14 లక్షలను బహుమతిగా అందించడం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఇదంతా నిజం.
అసలు ఎవరీ బాబు? ఉబర్ పేరే ఎందుకు పెట్టారు?
గత డిసెంబర్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న బాబ్లి అనే మహిళకు ఆస్పత్రి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సేవలు అందకపోతుండటంతో ఉబర్ క్యాబ్ను అద్దెకు తీసుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళను మొదట క్యాబ్లో తీసుకెళ్లడానికి నిరాకరించిన డ్రైవర్ షానవాజ్ ఖాన్ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒప్పకున్నాడు. ట్రాఫిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్లడానికి ఆలస్యం అవుతుండటంతో, మార్గం మధ్యలోనే బాబ్లి బాబుకు జన్మనిచ్చింది. ఆ సమయంలో బాబ్లికి అవసరమైన అన్ని సేవలను డ్రైవర్ షానవాజ్ ఖాన్ అందించారు. దేవుడిలా వచ్చి తమకు ఇంత సాయం చేసినందుకు బాబ్లి కృతజ్ఞత చెప్పడంతో, బాబు క్యాబ్లో పుట్టాడు కాబట్టి కంపెనీ పేరును బాబుకు పెట్టుకోవాలని డ్రైవర్ జోక్ చేశాడు. ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బాబ్లి, తమ బాబుకు ఉబర్ అనే పేరు పెట్టుకుంది. ఆ విషయం తెలిసిన ఉబర్ కంపెనీ, బాబుకు బర్త్డే వేడుకలతో పాటు, స్కాలర్షిప్ను అందించింది.
ఉబర్ కోసం ఉబర్ నిర్వహించిన బర్త్డే వేడుకల్లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్ పాల్గొన్నారు. బాబుకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఈ నగదు అందించనున్నారు. పేద ఇంట్లో పుట్టిన తమ బాబుకు కంపెనీ పేరు పెట్టుకున్నామని ఇంతమొత్తంలో నగదు అందించడంపై ఉబర్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటల్లో తమ బాబుకు పార్టీ నిర్వహించడం నిజంగా చాలా అదృష్టమని ఉబర్ తల్లి బాబ్లి పేర్కొంటోంది.
Advertisement