ఏకంగా ఆ స్టాక్ ధర రూ.60వేలకు ఎగిసింది!
ఏకంగా ఆ స్టాక్ ధర రూ.60వేలకు ఎగిసింది!
Published Mon, Mar 27 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఒక్కసారిగా ఆ స్టాక్ ధర రూ.60వేల మార్కును కొల్లగొట్టింది. సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్ లో మొదటిసారి ఆ స్టాక్ ధర రూ.60వేల క్రాస్ చేసినట్టు వెల్లడైంది. ఈ కంపెనీ షేరు ధర రూ.59,250 వద్ద ప్రారంభమైంది. అనంతరం ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలోకి రూ.60,140కు చేరుకుంది. చివరికి 1.21 శాతం లాభంతో ఈ కంపెనీ షేరు ధర రూ.59,900 వద్ద ముగిసింది. విలువ పరంగా చూసుకుంటే, ఎంఆర్ఎఫ్ ఎక్కువ ఖరీదైన దేశీ స్టాక్. దీని తర్వాత ఐషర్ మోటార్స్(రూ.24,322), బోస్ (రూ.22,988), శ్రీ సిమెంట్(రూ.16,460), పేజ్ ఇండస్ట్రీస్(రూ.14,803), 3ఎం ఇండియా(రూ.11,080) లు ఉంటాయి. ఈ దశాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి ఎంఆర్ఎఫ్ షేరు ధర 4,759 శాతం పైకి ఎగిసినట్టు తెలిసింది. అంటే 50 సార్లు అన్నమాట.
మార్చి 24 నాటికి ఇది రూ.59,184కు చేరుకుంది. ఎంఆర్ఎఫ్ రెవెన్యూలు, ఈబీఐడీటీఏ, ప్యాట్లు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 16, 17, 18 శాతం పైకి ఎగుస్తాయని ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఆనంద్ రతి ఫిబ్రవరిలోనే చెప్పారు. మార్కెట్ నిపుణుల ప్రకారం రబ్బర్ ధరలు ఫిబ్రవరి నుంచి 25 శాతం తగ్గాయని తెలిసింది. రబ్బర్ ధరలు తగ్గడం అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ వంటి టైర్ల తయారీ సంస్థలకు అనుకూలిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. స్వల్పకాల వ్యవధిలో ఈ కంపెనీల రెవెన్యూలు, మార్జిన్లు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. 2016 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ.288.08 కోట్లగా నమోదయ్యాయి. ఇతర మేజర్ టైర్ల కంపెనీలు అపోలో కూడా మధ్యాహ్నం ట్రేడింగ్ లో లాభపడినట్టు తెలిసింది.
Advertisement