ఏటీఎం ఘటనలో గాయపడ్డ మహిళ పరిస్థితి విషమం
బెంగళూరు : బెంగళూరులో ఏటీఎం ఘటనలో గాయపడిన మహిళ జ్యోతి ఉదయ్ కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుందని వైద్యుడు వెంకట్రామన్ తెలిపారు. ఆయన ఈరోజు ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తలకు శస్త్ర చికిత్స చేశామన్నారు. దుండగుడి దాడిలో మహిళ పుర్రెకు గాయాలు అయినట్లు తెలిపారు. గాయాల కారణంగా ఆమె కుడి భాగానికి పక్షవాతం వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం మహిళకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితులెవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగళూరులోని స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్‌లో మంగళవారం జరిగింది. మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్‌లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ నిన్న ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లింది. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు.
హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ప్రస్తుతం జ్యోతి ఉదయ్ బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.