Jyothy Uday
-
వాడు సైకో కాకపోవచ్చు!
*స్పష్టమైన తెలుగులో సంభాషణ *కదిరి ఏటీఎం కేంద్రంలో గుంతకల్లుకు చెందిన మహిళతో మాట్లాడిన వైనం కదిరి : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ నెల 10న ప్రమీలమ్మను చంపిన హంతకుడు.. 11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి..19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతగాడి బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తుంటే సైకో కాదని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు బృందంలోని ఓ పోలీస్ అధికారిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా...ఈ కేసుకు సంబంధించిన పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఈనెల 10న ధర్మవరంలో ప్రమీలమ్మను హత్య చేసేముందు రెండు ఏటీఎం కార్డులను బలవంతంగా లాక్కొని, సీక్రెట్ పిన్ నంబర్లను సైతం ఆమెతోనే చెప్పించుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. 11న ఉదయం 10.30 ప్రాంతంలో అతను కదిరి ఏటీఎం కేంద్రంలోకి వచ్చాడని ఇన్నాళ్లూ తాము భావించామని, అయితే ఉదయం 5.30 గంటలకే వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ బట్టి తెలుసుకున్నామని చెప్పారు. సుమారు 25 నిమిషాల పాటు ఏటీఎంలో గడిపి, ఆ తర్వాత ఓ దినపత్రికను కొనుక్కొని మళ్లీ ఏటీఎంలోకి వచ్చాడన్నారు. ఆ రోజు ఉదయం అతను ఉపయోగించిన ఏటీఎం కార్డు ప్రమీలమ్మదేనని గుర్తించామన్నారు. అయితే ... ఆ కార్డుకు సంబంధించిన బ్యాంకు ఖాతా 2012 ఏప్రిల్ 28వ తేదీనే క్లోజ్ అయినట్లు తెలిపారు. అందుకే అతను పలుమార్లు ప్రయత్నించినా డబ్బు రాలేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. అదే రోజు ఉదయం 10.30 ప్రాంతంలో ప్రమీలమ్మ కుమారునికి సంబంధించిన ఏటీఎం కార్డు ఉపయోగించి మూడు దఫాలుగా డబ్బు డ్రా చేశాడన్నారు. అతను ఏటీఎంలో ఉన్నప్పుడు అతని ముందు డబ్బు డ్రా చేసిన మహిళతో కాసేపు మాట్లాడాడని, ఆమె ప్రస్తుతం గుంతకల్లులో ఉద్యోగం చేస్తోందని వివరించారు. గతంలో కదిరిలో పనిచేసిన కారణంగా ఆమె ఆ రోజు ఇక్కడకు వచ్చినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. గీతల చొక్కా వేసుకున్న అతన్ని గతంలో తానెప్పుడూ చూడలేదని, ఆ రోజు డబ్బు డ్రా చేసేటప్పుడు మాత్రం ఇలా చేయండంటూ తనకు స్పష్టంగా చక్కటి తెలుగులోనే సలహా ఇచ్చాడని ఆమె తమతో చెప్పిందన్నారు. 12న ఉదయం 5.30 గంటలకు మరోసారి అదే ఏటీఎం కేంద్రానికి వచ్చి.. మళ్లీ ఆ కార్డుతోనే డబ్బు డ్రా చేశాడని, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లాడని తెలిపారు. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి, కదిరిలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి పోలికలు సరిపోయాయని, వాడే వీడని తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆ అధికారి ధీమా వ్యక్తం చేశారు. ‘ఏటీఎం’ అనుమానితున్ని ప్రశ్నించిన పోలీసులు ఏటీఎం దొంగ పోలీసులకు పట్టుబడ్డాడంటూ శుక్రవారం రాత్రి నగరంలో వదంతులు వ్యాపించాయి. వన్‌టౌన్ ఎస్ఐ ధరణి కిశోర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రామ్‌నగర్‌లోని ఏడీబీ ఏటీఎంలోకి ఓ వ్యక్తి తొంగిచూస్తుండడం గమనించిన సెక్యూరిటీ గార్డు ప్రసాద్ అతనిని నిలదీశాడు. అయితే అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తనకు డీఎస్పీ తెలుసంటూ ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రామ్‌నగర్‌కు చేరుకున్నారు. అప్పటికే వన్‌టౌన్ పోలీసులు తీసుకెళ్లారని తెలియడంతో, స్టేషన్ వద్దకు వెళ్లారు. సుమారు అరగంట అనంతరం స్టేషన్‌కు చేరుకున్న ఎస్ఐ ధరణికిశోర్ విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే, విలేకరులు పట్టుబట్టడంతో అతనిని వారి ముందు హాజరుపరిచారు. ఏటీఎం నిందితుని ఆనవాళ్లు ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విలేకరులు ఆరా తీయగా, తాను కర్నూలు జిల్లా వాసినని, రాప్తాడు హెడ్మాస్టర్ ఇంటికి పెయింట్ వేసేందుకు కూలీగా వచ్చానని తెలిపాడు. బజ్జీలు తినేందుకు మారుతీనగర్ నుంచి రామ్‌నగర్ ఏడీబీ బ్యాంక్ వద్దకు మిత్రులతో కలసి వచ్చానని అన్నాడు. మిత్రుల కోసం ఏటీఎం కేంద్రం వద్ద నిలుచుని ఉండగా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని తెలిపాడు. -
పిల్లాడి పుట్టినరోజు డబ్బుల కోసం వెళ్లి...
ఏటీఎంకు ఎందుకోసం వెళ్తాం? డబ్బులు తెచ్చుకోడానికే కదా.. అలాగే బెంగళూరు మహిళ కూడా తన పిల్లాడి పుట్టినరోజు జరిపేందుకు కావల్సిన డబ్బులు తెచ్చుకోడానికని ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. అక్కడ దుండగుడి బారిన పడి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఈ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు వెళ్లాయి. బాధితురాలు జ్యోతి ఉదయకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను, ఫుటేజ్ ఆధారంగాను అతడిని పట్టుకోగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ బ్యాంకు వైపు నుంచి తీవ్రమైన భద్రతాలోపాలు ఉన్నాయని, నగరం నడిబొడ్డున ఉన్న ఏటీఎంలో కూడా గార్డులు లేకపోవడం దారుణమని కమిషనర్ అన్నారు. బ్యాంకులన్నీ తప్పనిసరిగా తమ ఏటీఎంలు, శాఖల వద్ద భద్రతను పరిరక్షించుకోవాలని రాఘవేంద్ర తెరలిపారు. ఇదే అంశంపై కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి రెండు గంటల పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీప లాల్రోఖుమా పచావు, రాఘవేంద్ర ఔరాద్కర్, ఇతరులు పాల్గొన్నారు. కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని, జ్యోతి విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం, దిగ్భ్రాంతికరమని జార్జి అన్నారు. నిందితుడిని ఎదుర్కోవడంలో బాధితురాలు చూపించిన ధైర్యానికి ఆమెను ప్రశంసించారు. స్వయంగా బ్యాంకు మేనేజర్ అయిన 44 ఏళ్ల జ్యోతి.. దాదాపు మూడు గంటల పాటు రక్తపు మడుగులోనే ఏటీఎం సెంటర్లో పడి ఉన్నారు. నిందితుడు ఆమె వద్ద ఉన్న రూ. 2,500 నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు. జ్యోతి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగానే అతడు లోనికి వెళ్లి, షట్టర్‌ను లోపలి నుంచి కిందకి దించేసినట్లు వీడియో ఫుటేజిలో స్పష్టమైంది. అతడి వద్ద నాటు తుపాకి ఒకటి ఉందని, దాంతోపాటు కత్తి కూడా తీశాడని డిప్యూటీ కమిషనర్ డీసీ రాజప్ప తెలిపారు. తప్పించుకోడానికి ప్రయత్నించగా, ఓ మూలకు నెట్టేసి, ముఖంమీద కొట్టి, బ్యాగు లాక్కుని బయటకు పోతూ మళ్లీ బయటనుంచి షట్టర్ కిందకు దించేశాడన్నారు. నిందితుడి చేతుల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పక్షవాతానికి గురైంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు సుదీర్ఘ శస్త్రచికిత్స చేశామని, ఆమె ప్రస్తుతం మాట్లాడగలుగుతున్నారని శస్త్రచికిత్స చేసిన బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎన్కే వెంటకరమణ తెలిపారు. ఆమె కపాలం పగిలిందని, చిన్న ఎముకముక్క మెదడులోకి వెళ్లడంతో కుడివైపు పక్షవాతం వచ్చిందని వివరించారు. నిందితుడి వివరాలు తెలిస్తే తెలియజేయాల్సిన ఫోన్ నెంబరు: సిల్వర్ జూబ్లీ పార్కు పోలీసు స్టేషన్ - 080- 22942583 -
ఏటీఎం ఘటనలో గాయపడ్డ మహిళ పరిస్థితి విషమం
బెంగళూరు : బెంగళూరులో ఏటీఎం ఘటనలో గాయపడిన మహిళ జ్యోతి ఉదయ్ కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుందని వైద్యుడు వెంకట్రామన్ తెలిపారు. ఆయన ఈరోజు ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తలకు శస్త్ర చికిత్స చేశామన్నారు. దుండగుడి దాడిలో మహిళ పుర్రెకు గాయాలు అయినట్లు తెలిపారు. గాయాల కారణంగా ఆమె కుడి భాగానికి పక్షవాతం వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం మహిళకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితులెవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగళూరులోని స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది. మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ నిన్న ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లింది. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు. హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ప్రస్తుతం జ్యోతి ఉదయ్ బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి
బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది. ఏటీఎంలోకి వచ్చిన జ్యోతి ఉదయ్ ఆమె వెనుకనే లోనికి వచ్చి షట్టర్ మూస్తున్న దుండగుడు ఓ చేతిలో పిస్తోలు, మరో చేతిలో కత్తితో అరవొద్దని జ్యోతిని బెదిరిస్తూ... ఆమెను మూలకు నెట్టి కత్తితో దాడి చేస్తూ... కత్తికి అంటిన రక్తం మరకలు శుభ్రం చేసుకుంటూ... తర్వాత బయటకు వెళ్లిపోతూ... -
బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి
వేట కత్తితో దుండగుడి బీభత్సం.. బెంగళూరులో ఘటన మహిళ తల, ముక్కు, నుదుటిపై తీవ్ర గాయాలు బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది. మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ (38) ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లారు. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు. హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత ఆమె ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయాడు. వెళుతూ షట్టర్ కిందికి దించేశాడు. మూడు గంటల తర్వాత ఏటీఎం సెంటర్ బయట రక్తం మరకలు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమెను తొలుత నిమ్హాన్స్ ఆస్పత్రికి, అనంతరం బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ఎస్జే పార్కు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే డీసీపీ రవికాంత్ గౌడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలను రప్పించారు. దుండగుడి వేలిముద్రలు సేకరించారు. ఆమెకు సంబంధించిన రూ. 2,500 నగదు, సెల్‌ఫోన్ దాడి చేసిన వ్యక్తి ఎత్తుకెళ్లాడని డీసీపీ చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. అయితే, దుండగుడు ఒక్కడే వచ్చాడా.. లేక బయట మరొకరిని కాపలా ఉంచి లోపలికి ప్రవేశించాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. దుండగుడి దారుణకాండ అంతా ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దాంట్లో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది. కాగా, ఈ ఏటీఎం కేంద్రం ట్రాఫిక్ సిగ్నల్ పక్కనే ఉంది. రోజూ వేకువ జాము నుంచే ఇక్కడ రద్దీగా ఉంటుంది. అలాంటి చోట ఈ సంఘటన జరగడంతో నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.