బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి
- వేట కత్తితో దుండగుడి బీభత్సం.. బెంగళూరులో ఘటన
- మహిళ తల, ముక్కు, నుదుటిపై తీవ్ర గాయాలు
- బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్
బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్‌లో మంగళవారం జరిగింది. మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్‌లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ (38) ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లారు. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు. హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు.
దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత ఆమె ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయాడు. వెళుతూ షట్టర్ కిందికి దించేశాడు. మూడు గంటల తర్వాత ఏటీఎం సెంటర్ బయట రక్తం మరకలు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమెను తొలుత నిమ్హాన్స్ ఆస్పత్రికి, అనంతరం బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ఎస్‌జే పార్కు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే డీసీపీ రవికాంత్ గౌడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలను రప్పించారు.
దుండగుడి వేలిముద్రలు సేకరించారు. ఆమెకు సంబంధించిన రూ. 2,500 నగదు, సెల్‌ఫోన్ దాడి చేసిన వ్యక్తి ఎత్తుకెళ్లాడని డీసీపీ చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. అయితే, దుండగుడు ఒక్కడే వచ్చాడా.. లేక బయట మరొకరిని కాపలా ఉంచి లోపలికి ప్రవేశించాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. దుండగుడి దారుణకాండ అంతా ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దాంట్లో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది. కాగా, ఈ ఏటీఎం కేంద్రం ట్రాఫిక్ సిగ్నల్ పక్కనే ఉంది. రోజూ వేకువ జాము నుంచే ఇక్కడ రద్దీగా ఉంటుంది. అలాంటి చోట ఈ సంఘటన జరగడంతో నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.