వాడు సైకో కాకపోవచ్చు!
*స్పష్టమైన తెలుగులో సంభాషణ
*కదిరి ఏటీఎం కేంద్రంలో గుంతకల్లుకు చెందిన మహిళతో మాట్లాడిన వైనం
కదిరి : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ నెల 10న ప్రమీలమ్మను చంపిన హంతకుడు.. 11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి..19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతగాడి బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తుంటే సైకో కాదని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు బృందంలోని ఓ పోలీస్ అధికారిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా...ఈ కేసుకు సంబంధించిన పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి.
ఈనెల 10న ధర్మవరంలో ప్రమీలమ్మను హత్య చేసేముందు రెండు ఏటీఎం కార్డులను బలవంతంగా లాక్కొని, సీక్రెట్ పిన్ నంబర్లను సైతం ఆమెతోనే చెప్పించుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. 11న ఉదయం 10.30 ప్రాంతంలో అతను కదిరి ఏటీఎం కేంద్రంలోకి వచ్చాడని ఇన్నాళ్లూ తాము భావించామని, అయితే ఉదయం 5.30 గంటలకే వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ బట్టి తెలుసుకున్నామని చెప్పారు.
సుమారు 25 నిమిషాల పాటు ఏటీఎంలో గడిపి, ఆ తర్వాత ఓ దినపత్రికను కొనుక్కొని మళ్లీ ఏటీఎంలోకి వచ్చాడన్నారు. ఆ రోజు ఉదయం అతను ఉపయోగించిన ఏటీఎం కార్డు ప్రమీలమ్మదేనని గుర్తించామన్నారు. అయితే ... ఆ కార్డుకు సంబంధించిన బ్యాంకు ఖాతా 2012 ఏప్రిల్ 28వ తేదీనే క్లోజ్ అయినట్లు తెలిపారు. అందుకే అతను పలుమార్లు ప్రయత్నించినా డబ్బు రాలేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. అదే రోజు ఉదయం 10.30 ప్రాంతంలో ప్రమీలమ్మ కుమారునికి సంబంధించిన ఏటీఎం కార్డు ఉపయోగించి మూడు దఫాలుగా డబ్బు డ్రా చేశాడన్నారు. అతను ఏటీఎంలో ఉన్నప్పుడు అతని ముందు డబ్బు డ్రా చేసిన మహిళతో కాసేపు మాట్లాడాడని, ఆమె ప్రస్తుతం గుంతకల్లులో ఉద్యోగం చేస్తోందని వివరించారు. గతంలో కదిరిలో పనిచేసిన కారణంగా ఆమె ఆ రోజు ఇక్కడకు వచ్చినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.
గీతల చొక్కా వేసుకున్న అతన్ని గతంలో తానెప్పుడూ చూడలేదని, ఆ రోజు డబ్బు డ్రా చేసేటప్పుడు మాత్రం ఇలా చేయండంటూ తనకు స్పష్టంగా చక్కటి తెలుగులోనే సలహా ఇచ్చాడని ఆమె తమతో చెప్పిందన్నారు. 12న ఉదయం 5.30 గంటలకు మరోసారి అదే ఏటీఎం కేంద్రానికి వచ్చి.. మళ్లీ ఆ కార్డుతోనే డబ్బు డ్రా చేశాడని, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లాడని తెలిపారు. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి, కదిరిలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి పోలికలు సరిపోయాయని, వాడే వీడని తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆ అధికారి ధీమా వ్యక్తం చేశారు.
‘ఏటీఎం’ అనుమానితున్ని ప్రశ్నించిన పోలీసులు
ఏటీఎం దొంగ పోలీసులకు పట్టుబడ్డాడంటూ శుక్రవారం రాత్రి నగరంలో వదంతులు వ్యాపించాయి. వన్‌టౌన్ ఎస్‌ఐ ధరణి కిశోర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రామ్‌నగర్‌లోని ఏడీబీ ఏటీఎంలోకి ఓ వ్యక్తి తొంగిచూస్తుండడం గమనించిన సెక్యూరిటీ గార్డు ప్రసాద్ అతనిని నిలదీశాడు. అయితే అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తనకు డీఎస్పీ తెలుసంటూ ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రామ్‌నగర్‌కు చేరుకున్నారు.
అప్పటికే వన్‌టౌన్ పోలీసులు తీసుకెళ్లారని తెలియడంతో, స్టేషన్ వద్దకు వెళ్లారు. సుమారు అరగంట అనంతరం స్టేషన్‌కు చేరుకున్న ఎస్‌ఐ ధరణికిశోర్ విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే, విలేకరులు పట్టుబట్టడంతో అతనిని వారి ముందు హాజరుపరిచారు. ఏటీఎం నిందితుని ఆనవాళ్లు ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విలేకరులు ఆరా తీయగా, తాను కర్నూలు జిల్లా వాసినని, రాప్తాడు హెడ్‌మాస్టర్ ఇంటికి పెయింట్ వేసేందుకు కూలీగా వచ్చానని తెలిపాడు. బజ్జీలు తినేందుకు మారుతీనగర్ నుంచి రామ్‌నగర్ ఏడీబీ బ్యాంక్ వద్దకు మిత్రులతో కలసి వచ్చానని అన్నాడు. మిత్రుల కోసం ఏటీఎం కేంద్రం వద్ద నిలుచుని ఉండగా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని తెలిపాడు.