Physco
-
చిత్తూరులో సైకో వీరంగం
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. తనకు అడ్డువచ్చిన గ్రామస్థులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో సురేష్ సైకో ప్రవర్తనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి అతని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సురేశ్ చేతిలో ఉన్న కర్రతో పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పాటు ఎస్ఐ నాగేశ్వరరావుపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం చిత్తూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో కూడా సురేష్ సిబ్బందిపై దాడి చేయబోయాడు. సురేష్ పై ఇది వరకే అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. -
సోషల్ మీడియా ‘సైకో’లకు బేడీలు
సాక్షి, అమరావతి : ప్రభుత్వాన్ని పలుచన చేసే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న సైకోలకు పోలీసులు బేడీలు వేస్తున్నారు. రాజకీయ నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌పైన, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పైన వ్యక్తిగత దూషణలు చేసిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌లు సోమశేఖర్‌చౌదరితోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు గురువారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరోవ్యక్తిని అరెస్టు చేశారు. సీఎం వైఎస్ జగన్, మంత్రి అనిల్‌కుమార్, వైఎస్సార్సీపీ నేతలపై ఫేస్బుక్లో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లు పెట్టిన పి.నవీన్‌కుమార్ గౌడ్‌ను గురువారం అరెస్టు చేసినట్టు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కల్లకల్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ భార్య 2013లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో అతనిపై గతంలో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. కాగా ఇటీవల సీఎం, మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్‌లు పెట్టడంతో ఏపీ పోలీసులు ఐటీ యాక్ట్–2000 సెక్షన్ 67(లైంగిక అసభ్యకరమైన ప్రవర్తనను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురణ, ప్రసారం చేయడం), ఐపీసీ సెక్షన్ 153ఎ(మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, మొదలైన వాటి మధ్య శత్రుత్వం పెంచే చర్యలు), 505(2)(దుష్ట సంకల్పంతో ప్రకటనలు, పుకార్లు, భయంకర వార్తలను ప్రచారం చేయడం) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అభ్యంతరకర చర్యలు సరికాదు.. ఇతరులను విమర్శించే హక్కు ఉంది కదా అని సోషల్ మీడియాలో అభ్యంతరకర చర్యలకు పాల్పడటం సరికాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లతో ఇతరుల మనోభావాలు, గౌరవమర్యాదలకు భంగం కలిగించే విధంగా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టే సమయంలో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలన్నారు. - డీజీపీ సవాంగ్ -
గడ్డివాములు తగలబెట్టి ప్రేమలేఖలు పెడుతున్న సైకో..
బోయినపల్లి(చొప్పదండి) : మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల గడ్డికుప్పలను గుర్తుతెలియని సైకో దగ్ధం చేస్తున్నాడు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి బూర్గుపల్లి గ్రామానికి చెందిన కొలుపుల రాజయ్యకు చెందిన రూ.35 వేల విలువైన గడ్డికుప్పలు దగ్ధం చేశాడు. కొద్ది రోజుల క్రితం బోయినపల్లికి చెందిన నర్సయ్య, కోరెం గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డికుప్పలు దగ్ధం చేశాడు. లేఖ రాసి వదులుతున్న వైనం.. గడ్డికుప్పలు దగ్ధం చేస్తున్న వ్యక్తి ఓ లెటర్ రాసి, కాల్చిన ప్రదేశాల్లో కర్రకు ఉంచుతున్నాడని బాధితులు చెబుతున్నారు. లెటర్లో ప్రేమ సంబంధిత వ్యవహారాలు, కొందరి ఫోన్ నంబర్లు రాస్తున్నాడు. ఈ నెల 13న ఎంఆర్వో కార్యాలయానికి గడ్డికుప్పల బాధితులు వస్తే.. సమాధానం చెపుతానని లేఖలో రాశాడు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వాడు సైకో కాకపోవచ్చు!
*స్పష్టమైన తెలుగులో సంభాషణ *కదిరి ఏటీఎం కేంద్రంలో గుంతకల్లుకు చెందిన మహిళతో మాట్లాడిన వైనం కదిరి : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ నెల 10న ప్రమీలమ్మను చంపిన హంతకుడు.. 11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి..19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతగాడి బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తుంటే సైకో కాదని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు బృందంలోని ఓ పోలీస్ అధికారిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా...ఈ కేసుకు సంబంధించిన పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఈనెల 10న ధర్మవరంలో ప్రమీలమ్మను హత్య చేసేముందు రెండు ఏటీఎం కార్డులను బలవంతంగా లాక్కొని, సీక్రెట్ పిన్ నంబర్లను సైతం ఆమెతోనే చెప్పించుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. 11న ఉదయం 10.30 ప్రాంతంలో అతను కదిరి ఏటీఎం కేంద్రంలోకి వచ్చాడని ఇన్నాళ్లూ తాము భావించామని, అయితే ఉదయం 5.30 గంటలకే వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ బట్టి తెలుసుకున్నామని చెప్పారు. సుమారు 25 నిమిషాల పాటు ఏటీఎంలో గడిపి, ఆ తర్వాత ఓ దినపత్రికను కొనుక్కొని మళ్లీ ఏటీఎంలోకి వచ్చాడన్నారు. ఆ రోజు ఉదయం అతను ఉపయోగించిన ఏటీఎం కార్డు ప్రమీలమ్మదేనని గుర్తించామన్నారు. అయితే ... ఆ కార్డుకు సంబంధించిన బ్యాంకు ఖాతా 2012 ఏప్రిల్ 28వ తేదీనే క్లోజ్ అయినట్లు తెలిపారు. అందుకే అతను పలుమార్లు ప్రయత్నించినా డబ్బు రాలేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. అదే రోజు ఉదయం 10.30 ప్రాంతంలో ప్రమీలమ్మ కుమారునికి సంబంధించిన ఏటీఎం కార్డు ఉపయోగించి మూడు దఫాలుగా డబ్బు డ్రా చేశాడన్నారు. అతను ఏటీఎంలో ఉన్నప్పుడు అతని ముందు డబ్బు డ్రా చేసిన మహిళతో కాసేపు మాట్లాడాడని, ఆమె ప్రస్తుతం గుంతకల్లులో ఉద్యోగం చేస్తోందని వివరించారు. గతంలో కదిరిలో పనిచేసిన కారణంగా ఆమె ఆ రోజు ఇక్కడకు వచ్చినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. గీతల చొక్కా వేసుకున్న అతన్ని గతంలో తానెప్పుడూ చూడలేదని, ఆ రోజు డబ్బు డ్రా చేసేటప్పుడు మాత్రం ఇలా చేయండంటూ తనకు స్పష్టంగా చక్కటి తెలుగులోనే సలహా ఇచ్చాడని ఆమె తమతో చెప్పిందన్నారు. 12న ఉదయం 5.30 గంటలకు మరోసారి అదే ఏటీఎం కేంద్రానికి వచ్చి.. మళ్లీ ఆ కార్డుతోనే డబ్బు డ్రా చేశాడని, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లాడని తెలిపారు. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి, కదిరిలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి పోలికలు సరిపోయాయని, వాడే వీడని తాము నిర్ధారణకు వచ్చామని చెప్పారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆ అధికారి ధీమా వ్యక్తం చేశారు. ‘ఏటీఎం’ అనుమానితున్ని ప్రశ్నించిన పోలీసులు ఏటీఎం దొంగ పోలీసులకు పట్టుబడ్డాడంటూ శుక్రవారం రాత్రి నగరంలో వదంతులు వ్యాపించాయి. వన్‌టౌన్ ఎస్ఐ ధరణి కిశోర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రామ్‌నగర్‌లోని ఏడీబీ ఏటీఎంలోకి ఓ వ్యక్తి తొంగిచూస్తుండడం గమనించిన సెక్యూరిటీ గార్డు ప్రసాద్ అతనిని నిలదీశాడు. అయితే అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తనకు డీఎస్పీ తెలుసంటూ ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున రామ్‌నగర్‌కు చేరుకున్నారు. అప్పటికే వన్‌టౌన్ పోలీసులు తీసుకెళ్లారని తెలియడంతో, స్టేషన్ వద్దకు వెళ్లారు. సుమారు అరగంట అనంతరం స్టేషన్‌కు చేరుకున్న ఎస్ఐ ధరణికిశోర్ విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే, విలేకరులు పట్టుబట్టడంతో అతనిని వారి ముందు హాజరుపరిచారు. ఏటీఎం నిందితుని ఆనవాళ్లు ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విలేకరులు ఆరా తీయగా, తాను కర్నూలు జిల్లా వాసినని, రాప్తాడు హెడ్మాస్టర్ ఇంటికి పెయింట్ వేసేందుకు కూలీగా వచ్చానని తెలిపాడు. బజ్జీలు తినేందుకు మారుతీనగర్ నుంచి రామ్‌నగర్ ఏడీబీ బ్యాంక్ వద్దకు మిత్రులతో కలసి వచ్చానని అన్నాడు. మిత్రుల కోసం ఏటీఎం కేంద్రం వద్ద నిలుచుని ఉండగా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని తెలిపాడు.