సాక్షి, అమరావతి : ప్రభుత్వాన్ని పలుచన చేసే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న సైకోలకు పోలీసులు బేడీలు వేస్తున్నారు. రాజకీయ నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌పైన, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పైన వ్యక్తిగత దూషణలు చేసిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌లు సోమశేఖర్‌చౌదరితోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు గురువారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరోవ్యక్తిని అరెస్టు చేశారు.
సీఎం వైఎస్ జగన్, మంత్రి అనిల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నేతలపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లు పెట్టిన పి.నవీన్‌కుమార్ గౌడ్‌ను గురువారం అరెస్టు చేసినట్టు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కల్లకల్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ భార్య 2013లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో అతనిపై గతంలో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఉంది. కాగా ఇటీవల సీఎం, మంత్రులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్‌లు పెట్టడంతో ఏపీ పోలీసులు ఐటీ యాక్ట్–2000 సెక్షన్ 67(లైంగిక అసభ్యకరమైన ప్రవర్తనను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురణ, ప్రసారం చేయడం), ఐపీసీ సెక్షన్ 153ఎ(మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, మొదలైన వాటి మధ్య శత్రుత్వం పెంచే చర్యలు), 505(2)(దుష్ట సంకల్పంతో ప్రకటనలు, పుకార్లు, భయంకర వార్తలను ప్రచారం చేయడం) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
అభ్యంతరకర చర్యలు సరికాదు..
ఇతరులను విమర్శించే హక్కు ఉంది కదా అని సోషల్ మీడియాలో అభ్యంతరకర చర్యలకు పాల్పడటం సరికాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లతో ఇతరుల మనోభావాలు, గౌరవమర్యాదలకు భంగం కలిగించే విధంగా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టే సమయంలో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలన్నారు.
- డీజీపీ సవాంగ్
Comments
Please login to add a commentAdd a comment