'ఏటీఎం' దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్!
రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అతడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హిందుపురం పట్టణంలో మొబైలు ఫోన్ విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుమానితుడు హిందుపురానికి చెందినవాడు. పోలీసులు విచారణ నిమిత్తం అతడిని కర్ణాటకకు తరలించారు.
కాగా బెంగళూరులో నగదు డ్రా చేసేందుకు బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్ ఏటీఎం సెంటర్కు వెళ్లింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి షెటర్ మూసివేసి, ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. అలాగే తలపై బలంగా కొట్టాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్ ఫోన్ తీసుకుని అతడు పరారయ్యాడు. ఏటీఎం నుంచి రక్తం రావడంతో స్థానికులు అనుమానించి షటర్ ఎత్తి చూడటంతో రక్తపు మడుగులో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. దాంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అయితే ఏటీఎంలో మహిళపై ఆగంతకుడు దాడి, అనంతరం జరిగిన తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో పోలీసులు సీసీ పూటేజ్లను పరిశీలించారు. నిందుతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కర్ణాటక పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసుల సహాయం తీసుకున్నారు. దాంతో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అనుమానితుడి అరెస్ట్ ను పోలీసులు ఇంకా ద్రువీకరించలేదు.