ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన మహిళలు
హిందూపురం అర్బన్ : హిందూపురంలో ఏవార్డులో చూసినా తాగేందుకు నీరు లేక ప్రజలు అల్లాడిపోతుంటే నీరివ్వలేని ప్రభుత్వం వీధివీధినా మద్యంషాపులు పెట్టి తాగించడానికి సిద్ధమైందని మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చౌడేశ్వరీ కాలనీలో జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. మద్యంషాపు తీసివేయాలని వందలాదిమంది పెనుకొండ రహదారిలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్, ట్రాఫిక్ పోలీసులు తరలివచ్చి మహిళలను సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించడం ట్రాఫిక్ సమస్య వస్తోందని అందరూ అధికారుల వద్దకు వెళ్లాలని చెప్పారు.
దీంతో మహిళలు నేరుగా పక్కనే ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి వెళ్లి నినాదాలు చేశారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎమ్మెల్యేపీఏ కృష్ణమూర్తి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. చివరికి ఎక్సైజ్ అధికారులతో సంప్రదించి షాపు మార్పించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జయమ్మ, నాయకులు రమేష్, బీజేవైఎం జిల్లా నాయకులు అశోక్‌కుమార్, నరేష్, మంజు, అంజి, ప్రసాద్, కాలనీ మహిళలు గంగరత్న, రామాంజనమ్మ, పార్వతమ్మ, నాగమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మిదేవి, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.