ఆ ఏటీఎం ఘటనలో మరో ముందడుగు
బెంగళూరు: మూడేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి ఘటనలో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో బాధితురాలు నిందితుడిని ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో గుర్తు పట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన మధుకర్‌రెడ్డి(43) ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ 2011లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత 2013లో బెంగళూరులోని ఏటీఎంలో ఓ మహిళపై వేటకత్తితో దాడి చేసి, దోచుకున్నాడు. ఇదంతా ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు ఉద్యోగి. తీవ్రంగా గాయపడిన ఆమె ఎడమ చేతికి పక్షవాతం కూడా వచ్చింది.
అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మధుకర్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు దొరికిపోయాడు. అతడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని పరప్పణ జైలులో రిమాండ్ చేశారు. విచారణలో అతడు పలు నేరాలకు పాల్పడ‍్డట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సెక్స్ వర్కర్‌తోపాటు ఏపీలో ఇద్దరు మహిళలను అతడు హత్య చేసినట్లు తేలిందన్నారు. పరప్పణ అగ్రహారం సెంట్రల్ జైలులో శుక్రవారం నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని బాధితురాలు గుర్తు పట్టారని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనాలు
పోలీసుల అదుపులో ఏటీఎం దుండగుడు మధు?
బెంగళూరు ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి
‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం