బిజినెస్‌కి బెంగళూరు భేష్..
న్యూఢిల్లీ: ఐటీ రంగానికి సంబంధించి దేశీ సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ 12వ స్థానంలో, విశాఖపట్నం 21వ స్థానంలో నిల్చాయి. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (జిరెమ్), రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ దిగ్గజం డీటీజెడ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నగర అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలు, మానవవనరులు, నగర సంస్కృతి, జీవన ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు, నీరు, వసతి వంటి అంశాలను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత చెన్నై, ముంబై, పుణే నగరాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకోగా ఢిల్లీకి అసలు చోటు దక్కలేదు. అయితే, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని నోయిడా (17), గుర్గావ్ (19)లకు స్థానం లభించింది.
మొత్తం 21 నగరాలను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో కొన్ని మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాపార కేంద్రాలుగా రూపొందాయని, మిగతావి మరింత ఎదిగేందుకు అవకాశం ఉందని జిరెమ్ చైర్మన్ సంకే ప్రసాద్ వివరించారు. ఈ నగరాలకి ఇచ్చిన ర్యాంకింగ్‌ని బట్టి భవిష్యత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి వ్యాపార సంస్థలకు ఒక అవగాహన లభించగలదని ఆయన పేర్కొన్నారు. మెట్రో నగరాలు ఇప్పటికే ర్దీగా మారడంతో పెట్టుబడులకు, వ్యాపార నిర్వహణకు అనువైన కొత్త ప్రాంతాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాలను మెరుగుపర్చాల్సి ఉంటుందని ప్రసాద్ పేర్కొన్నారు. ఒకవైపు మెట్రోల్లో రద్దీని తగ్గించేందుకు, మరోవైపు ద్వితీయ శ్రేణి నగరాల్లో టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని చెప్పారు.
జాబితాలో మరిన్ని నగరాలు...
సర్వే ప్రకారం ఇండోర్ (5వ ర్యాంకు), భువనేశ్వర్ (6), కోయంబత్తూర్ (7), అహ్మదాబాద్ (8), నాగ్‌పూర్ (9), కొచ్చి 10వస్థానం దక్కించుకున్నాయి. అలాగే చండీగఢ్‌కి 11వ స్థానం, మంగళూరు (13), వడోదర (14), జైపూర్ (15), కాలికట్ (16), కోల్‌కతా (18), నవీ ముంబై 20వ స్థానాల్లో నిల్చాయి.