
బీఓఐ రుణ రేటు పావుశాతం కోత..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కనీస రుణ రేటును (బేస్‌రేట్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీంతో ఈ రేటు ప్రస్తుత 10.20 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గుతుంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంక్ ఆటో, గృహ ఇతర రుణ రేట్లు తగ్గే అవకాశం ఏర్పడింది. మే 4వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెస్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఈ దిశలో ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15 శాతం నుంచి 0.25 శాతం వరకూ తగ్గించాయి.