71 లక్షల కోట్ల డాలర్లకు షాడో బ్యాంకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా షాడో బ్యాంకింగ్ వ్యవస్థ పరిమాణం గతేడాది 5 లక్షల కోట్ల డాలర్ల(ట్రిలియన్) మేర ఎగిసి 71 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాల బ్యాంకులు ఆయా షాడో బ్యాంకింగ్ సంస్థలకి ఇచ్చిన నిధుల పరిమాణం కూడా పెరిగింది. స్విట్జర్లాండ్‌కి కేంద్రంగా పనిచేసే ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల బోర్డు ఎఫ్‌ఎస్‌బీ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి రాకుండా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు మొదలైన వాటిని షాడో బ్యాంకింగ్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఈ కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరిగిపోతుండటం.. ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెచ్చిపెట్టగలవని ఇటీవలి ఆర్థిక సంక్షోభం తెలియజెప్పడంతో ఇటువంటి వాటిపై ఆందోళనలు నెలకొన్నాయి. బ్యాంకులు స్వయంగా రుణాలివ్వడం వల్ల వచ్చే రిస్కులతో పాటు, ఇతరత్రా రుణాలు మంజూరుకు మధ్యవర్తిత్వ షాడో బ్యాంకింగ్ సంస్థలపై ఆధారపడటం వల్ల వచ్చే రిస్కులూ భారత్, ఇండోనేషియా, సౌదీలో భారీగా పెరిగాయని ఎఫ్‌ఎస్‌బీ పేర్కొంది.