ఆర్నబ్ బాటలో మరో సీనియర్ జర్నలిస్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న ఆర్నబ్ గోస్వామి బాటలో మరో సీనియర్ జర్నలిస్ట్ నడిచారు. ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కా దత్ రాజీనామా చేశారు. ప్రైమ్‌టైమ్ షో 'ద న్యూస్ అవర్' ద్వారా పాపులరైన ఆర్నబ్ గోస్వామి సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బర్కా దత్ కూడా సొంతంగా వెంచర్ ప్రారంభిస్తారని సమాచారం.
బర్కా దత్ సుదీర్ఘకాలం సంస్థలో పనిచేశారని, ఆమె భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షిస్తున్నామని ఎన్డీటీవీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1995లో ఎన్డీటీవీలో చేరిన బర్కా దత్ పలు హోదాల్లో పనిచేశారు. 21 ఏళ్ల పాటు ఆమె నిబద్ధతతో పనిచేశారని, సంస్థ అభివృద్ధికి కృషి చేశారని ఎన్డీటీవీ ప్రశంసించింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా దత్ విస్తృతంగా కవరేజీ ఇచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందజేసి ఆమెను గౌరవించింది. కాగా రాడియా టేప్స్ వ్యవహారంలో ఆమెపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.