384 మర్రిచెట్లను 'కన్న' మహిళకు బీబీసీ గుర్తింపు
పిల్లలు లేకపోతేనేం? ఈ చెట్లే నా పిల్లలు, అంటుంది సాలుమరద తిమ్మక్క. కర్ణాటకకు చెందిన ఈ 103 ఏళ్ల బామ్మ రోడ్డు పొడవునా 384 మర్రిచెట్లను పెంచి, ఆదర్శ పర్యావరణవేత్తగా నిలిచింది. 2016 అత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో బీబీసీ తిమ్మక్క పేరును కూడా చేర్చింది. తిమ్మక్క నిరక్షరాస్యురాలు. రోజుకూలీ చేసేది. పశువులను మేపుకునే చిక్కయ్యతో చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. దురదృష్టవశాత్తూ వారికి సంతానం కలగలేదు. సమాజంలో హేళన ఎదుర్కొన్నారు.
దాంతో పిల్లలు లేకపోతేనేం, మొక్కలనే పిల్లల్లాగా పెంచుకుందాం, అనుకున్నారు. అలా తిమ్మక్క దంపతులు స్టేట్ హైవే 94 మీద హులికల్ నుంచి కూడూర్ మధ్యలో తొలుత పది చెట్లతో ప్రారంభించి, తరువాతి సంవత్సరం పదిహేను, మరుసటి ఏడాది ఇరవై ఇలా మర్రిచెట్లను నాటుతూ పోయారు. వాటికి 4 కిలోమీటర్లు మోసుకెళ్లి నీళ్లు పోసేవారు. పశువులు మేయకుండా చుట్టూ కంచె వేసేవారు. చాలీ చాలని సంపాదనతోనే చెట్లను సంరక్షించారు.
తిమ్మక్క భర్త 1991లో చనిపోయారు. తర్వాత తిమ్మక్క ఒంటరిగానే వాటి బాధ్యత తీసుకుంది. సాలుమరద అంటే చెట్లవరస. అదే ఇప్పుడు తిమ్మక్క ఇంటి పేరైంది. ఆ గుబురు చెట్ల మధ్య, పర్యావరణ పాఠాలను వినడానికి ఎంతోమంది పర్యావరణ కార్యకర్తలు ఆమెను కలుస్తున్నారు.
