బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి | BC bill For Center On Stress | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి

Published Sat, Aug 15 2015 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి - Sakshi

బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి

బీసీ సంఘాల నేతలకు సోనియా హామీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బీసీ సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. పార్టీ విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీలోనూ బీసీల డిమాండ్లపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నాయకత్వంలో బీసీ నేతల ప్రతినిధి బృందం శుక్రవారం 10-జన్‌పథ్‌లో సోనియాతో భేటీ అయ్యింది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీల డిమాండ్లను సోనియాకు వారు వివరించారు.

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెస్తే ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గుతుందని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ బిల్లును పార్లమెంటులో పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని, కేంద్రం స్థాయిలో రూ.50 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

క్రీమీలేయర్ విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. బీసీల ఉద్యమాన్ని పార్టీ వేదికల ద్వారా పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు. సోనియాను కలిసిన వారిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, గుజ్జ కృష్ణ, సి.రాజేందర్, నర్సింహ నాయక్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేశ్ యాదవ్, ఆర్.సత్యనారాయణ, శారదా గౌడ్, నాగేశ్వర్, పృథ్వీ గౌడ్, భాషయ్య, బత్తెన రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement