BC union leadership
-
ఈటల రాజేందర్ బర్తరఫ్‌పై నిరసన
మంచిర్యాల: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయనకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలోని అవినీతిపరులు, భూకబ్జాదారులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఒడ్డెపల్లి మనోహర్, ముత్తోజు రమేశ్, జిల్లా కార్యదర్శి గుండోజు రమేశ్, నాయకుడు రాజన్న పాల్గొన్నారు. -
‘బీసీ బిల్లును’ పార్లమెంట్లో ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర సామాజిక న్యాయసాధికార శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జి.రమేష్ తదితరులు కలిసి డిమాండ్ చేశారు. 16 డిమాండ్లతో వినతిపత్రం పార్లమెంట్లో బీసీ బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. లక్ష కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, కేంద్రంలో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో సాచురేషన్ పద్ధతిలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ స్కీం ప్రవేశపెట్టాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం, విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. మొత్తం 16 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చారు. ఫిబ్రవరిలో బిల్లు పెడతాం: గెహ్లాట్ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్లో బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే విధంగా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చే బిల్లును సైతం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేయాలని కోరారు. -
బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి
బీసీ సంఘాల నేతలకు సోనియా హామీ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బీసీ సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. పార్టీ విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీలోనూ బీసీల డిమాండ్లపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నాయకత్వంలో బీసీ నేతల ప్రతినిధి బృందం శుక్రవారం 10-జన్‌పథ్‌లో సోనియాతో భేటీ అయ్యింది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీల డిమాండ్లను సోనియాకు వారు వివరించారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెస్తే ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గుతుందని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ బిల్లును పార్లమెంటులో పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని, కేంద్రం స్థాయిలో రూ.50 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. క్రీమీలేయర్ విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. బీసీల ఉద్యమాన్ని పార్టీ వేదికల ద్వారా పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు. సోనియాను కలిసిన వారిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, గుజ్జ కృష్ణ, సి.రాజేందర్, నర్సింహ నాయక్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేశ్ యాదవ్, ఆర్.సత్యనారాయణ, శారదా గౌడ్, నాగేశ్వర్, పృథ్వీ గౌడ్, భాషయ్య, బత్తెన రాజు తదితరులు ఉన్నారు. -
బీసీలకు కేంద్రం అన్యాయం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలోని 70 కోట్ల మంది వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధికోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది సమర్థులైన బీసీ నేతలున్నా వారికి సీఎం పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ కులంలో పుట్టడమే ముఖ్యమంత్రి పదవికి అనర్హతగా మారిందని, ఇప్పటివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 30 మంది ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క బీసీ కూడా ఆ జాబితాలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం పదవిని కచ్చితంగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్, ఎస్.దుర్గయ్యగౌడ్, కె.బాలరాజ్, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, పెరిక సురేశ్, అశోక్‌గౌడ్, నర్సింహనాయక్, జి.అంజి, ఎ.పాండు, పి.సతీశ్, జి.భాస్కర్, బి.సదానందం తదితరులు పాల్గొన్నారు.