అప్రమత్తంగా ఉండాలి: టీ-నేతలు | Be alert everybody: Telangana leaders | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి: టీ-నేతలు

Published Wed, Oct 16 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

అప్రమత్తంగా ఉండాలి: టీ-నేతలు

అప్రమత్తంగా ఉండాలి: టీ-నేతలు

తెలంగాణ పోరాటంలో ఇది సంధి కాలం  
దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’లో టీ-నేతల పిలుపు

 
 సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో ఇప్పుడు నడుస్తున్నది సంధికాలమని.. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు రాజకీయ వేత్తలు, ఉద్యమనేతలు, మేధావులు, కవులు, కళాకారులు పిలుపిచ్చారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో కొందరు మోకాలడ్డే ప్రమాదం ఉందన్నారు. సమన్యాయమనే వాదన వట్టి డొల్ల వాదనని విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో దసరా మిలాప్- అలయ్ బలయ్-ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరో ముఖ్య అతిధిగా రావాల్సిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గైర్హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఏడేళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కళారూపాల ప్రదర్శనతో పాటు ఆ ప్రాంత పిండివంటలు ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆయా నేతలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఉద్యమ కార్యాచరణ గురించి మాట్లాడారు.
 
 విడిపోయి.. కలుసుందాం...
 తెలంగాణ కల సాకారమయ్యేవేళ ఈ ప్రాంత సంస్కృతిని దేశవ్యాప్తం చేయాలని మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఆప్యాయత, ఆత్మీయత తెలంగాణ సద్గుణమని, అటువంటి సంస్కృతిని ప్రతిబింబించేలా మున్ముందు మరిన్ని ఆత్మీయ సమ్మేళనాలు జరగాలని జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటులో కొన్ని చిక్కులు, ప్రలోభాలు, రాజకీయ ఇబ్బందులు వస్తాయని సురవరం వ్యాఖ్యానించారు. ప్రధాన రాజకీయ పక్షాలు తమ వాగ్దానం నుంచి వెనక్కు వెళ్లకుండా తెలంగాణ కల సాకారమయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం ముందయినా ఈ ప్రాంతంలోని రాజకీయ పక్షాలన్నీ కలిసికట్టుగా ఒకే గొంతు వినిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామన్నారు. త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తోందని, పార్లమెంటులో బిల్లు పాసయ్యేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ కల సాకారమయ్యేంత వరకు కదం కదం కలిపి నడవాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. విజయం సిద్ధించుతున్న వేళ వినమ్రంగా ఉండాలన్నారు. వచ్చే అలయ్ బలయ్ స్వతంత్ర తెలంగాణలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌పై కాంగ్రెస్ కిరికిరి పెట్టడం తథ్యమని.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్ నాయకుడు కె.కేశవరావు పిలుపిచ్చారు.
 
 వెంకయ్య అడ్డుపుల్లగా మారారు...
 వెంకయ్యనాయుడు తెలంగాణకు అడ్డుపుల్లగా మారారని, మరోపక్క చంద్రబాబునాయుడు కూడా వస్తున్నారని ప్రముఖ కవి అంద్శైవిమర్శించారు. గడ్డిపోచ మాదిరి వెంకయ్య అడ్డం వస్తే ఒక్కసారిగా భగ్గుమనక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ యూ టర్న్ తీసుకునే ప్రశ్నే లేదని.. ఇక తెలంగాణ వచ్చేలా చూడాల్సిన బాధ్యత బీజేపీదేనని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఏపీఎన్‌జీవోలు చేస్తున్న ఆందోళన దొబ్బిపోయిన ఉద్యోగాలు క్రమబద్ధీకరించమనా? అని ఎంపీ రాజయ్య ప్రశ్నించారు. తెలంగాణలో దొంగలు పడ్డారని నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతి కార్మిక సంస్కృతితో ముడిపడి ఉందని చుక్కా రామయ్య చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కుపోదని, లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సీమాంధ్రకు వ్యతిరేకమైంది కాదని మురళీధర్‌రావు పేర్కొన్నారు.
 
 దత్తాత్రేయ సహా ప్రముఖులకు సన్మానం...
 ఈ కార్యక్రమంలో దత్తాత్రేయను కురుమ సంఘం సన్మానించింది. అలాగే.. వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖుల్ని కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వీరిలో పి.వేణుగోపాల్‌రెడ్డి (ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్), డాక్టర్ వ్యాకరణం నాగేష్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్), రసమయి బాలకిషన్ (తెలంగాణ కవి, గాయకుడు), ఖాన్ అక్తర్ (ప్రముఖ సంగీత విద్వాంసుడు), సంఘంరెడ్డి సత్యనారాయణ (జై తెలంగాణ పత్రిక వ్యవస్థాపకులు), దరువు ఎల్లన్న (ఉస్మానియా జేఏసీ నేత), మాడభూషి శ్రీధర్ (నల్సార్ యూనివర్శిటీ), యడ్లపాటి రఘునాథ్‌బాబు (బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ) తదితరులు ఉన్నారు. వివిధ పార్టీల నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, సి.హెచ్.విద్యాసాగరరావు, బద్దం బాల్‌రెడ్డి, డాక్టర్ కె.హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, పుష్పలీల, పి.చంద్రశేఖర్‌రావు, ఎన్.రామమోహనరావు, దాసరి మల్లేశం, శాంతారెడ్డి (బీజేపీ), ఈటెల రాజేందర్, వివేక్ (టీఆర్‌ఎస్), మధుయాష్కీ (కాంగ్రెస్), అజీజ్‌పాషా (సీపీఐ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ), కఠారి శ్రీనివాస్ (లోక్‌సత్తా), టీజేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, అద్దంకి దయాకర్, విఠల్, సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, శైలేష్‌రెడ్డి, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు, పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement