జాగ్రత్తగా బ్రీఫ్ చేయాలి...
‘ఓటుకు కోట్లు’ సంఘటనలో ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ లాంటి పదాలు తరహా లాంటివి కాకుండా, కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇంగ్లీషు పదప్రయోగం ఎలాంటి పొరపాట్లు లేకుండా కరెక్ట్‌గా ఉండాలని ఇటీవల తరచూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తి విభజన హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న ఈ తరుణంలో అధికార యంత్రాంగం కేంద్రానికి పంపే ప్రతిపాదనల్లో సరైన పదాలు, పరిభాష సరిగా ఉండాలని బాస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. ఎప్పుడూ లేనిది ఇదేందబ్బా.. అని ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు.
ఇంగ్లీషు పదప్రయోగానికి సంబంధించి తాజాగా జారీ అయిన ఓ ఆదేశాన్ని ఉటంకిస్తున్నారు. అదేంటంటే.. రాజధానికి ఉద్యోగుల తరలింపు అంశంలో ‘స్థానికత’ కు కేంద్రం సవరణలు చేయాల్సి ఉంది. స్థానికతపై కేంద్రం సవరణలు చేస్తే ఒక్క ఉద్యోగులకు మాత్రమే స్థానికత వర్తించదు. ఉద్యోగులతో పాటు ఏపీకే చెందిన తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకి ఈ ఉత్తర్వు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా సవరణకు సంబంధించి సిఫారసు చేయాల్సి ఉంటుంది.
ఈ విషయంలో కేంద్రానికి సిఫారసు చేసేందుకు ఎలాంటి తప్పులు లేకుండా, స్థానికత ఒక్క ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వర్తింపచేసే అవకాశం ఉంటుందా? అన్న కోణంలో సమగ్ర పరిశీలన జరిపి, సరైన ఇంగ్లీషు పదాలు వాడాలని బాస్ నుంచి ఉన్నతాధికారులకు సూచనలు అందాయట. ఈ సూచనలు ఆసాంతం విన్న ఉన్నతాధికారులకు అసలు విషయం అప్పుడు అర్ధమైందట. ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ఇంగ్లీషు ప్రపంచానికి అర్ధమై బాగా పాపులారిటీ సంపాదించుకున్న దరిమిలా ఇప్పడాయన ఆదేశాలు సచివాలయంలోని ఉన్నతాధికారుల్లో పెద్ద చర్చకు దారితీసింది.