మరో 4 మృతదేహాల లభ్యం
బియాస్ నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మరో నలుగురు విద్యార్థుల మృత దేహాలు లభించాయి. ఆదివారం లార్జీ డ్యాంలో 600 మందికిపైగా ఆర్మీ, నేవీ, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, రాష్ట్ర పోలీసులు, 40 మంది గజ ఈతగాళ్ల బృందం సాగించిన గాలింపు చర్యలతో ఉదయం ఒక దానిక వెనుక మరొకటిగా మూడు మృత దేహాలు లభించాయి. అటు తర్వాత సాయంత్రం మరో మృత దేహం గజ ఈతగాళ్లకు లభించింది. తాజాగా దొరికిన మృత దేహాల్లో ఘటన జరిగిన రోజు విపరీత వేగంతో లార్జీ ప్రాజెక్టు నుంచి నీటి ప్రవాహం వస్తున్నప్పటికీ వెరవకుండా తన ప్రాణాలను రక్షించుకునే బదులు నలుగురు తోటి విద్యార్థులను ఒడ్డుకు చేర్చి చివరికి తాను ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువు ఒడి చేరిన ఎం.కిరణ్‌కుమార్ మృతదేహం కూడా ఉంది.
మిగతా మృతదేహాలను హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటున్న పరమేష్, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ కాలనీకి చెందిన రుత్విక్‌గా గుర్తించినట్లు ఇక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ స్పెషల్ బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్‌త్రివేది ‘సాక్షి’తో చెప్పారు. కిరణ్‌కుమార్‌ది ఖమ్మం జిల్లా కాగా అతను హైదరాబాద్‌లోని లింగంపల్లిలో తన మామ నివాసంలో ఉండేవాడని తోటి విద్యార్థులు తెలిపారు.
చివరగా దొరికిన మృతదేహం అఖిల్‌దిగా గుర్తించారు. వరంగల్ లోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతుల కుమారుడు అఖిల్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(ఈఐఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన చిందం వీరన్న, ఉమ దంపతుల కుమారుడిగా చిందం పరమేశ్వర్(24)ను గుర్తించారు. రెండు వారాల క్రితం బియాస్ నదిలో హైదరాబాద్‌కు చెందిన 24మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతవగా తాజాగా దొరికిన మృతదేహాలతో ఇప్పటిదాకా మొత్తం 17 మృతదేహాలు దొరికినట్లయింది. మిగతా ఏడుగురు విద్యార్థులు, ఒక ఫ్యాకల్టీ సభ్యుడి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. మృతదేహాలన్నీ లార్జీ, పండు డ్యాంల మధ్యలోనే లభిస్తున్నాయని, ముఖ్యంగా అక్కడున్న నగోజి దేవాలయం పరిసరాల్లోనే 13 దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా స్వాధీనం చేసుకున్న మృతదేహాల పోస్టుమార్టం పూర్తి చేసి ఇక్కడి నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి సోమవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు పంపనున్నట్లు అదనపు డీజీ రాజీవ్ త్రివేది చెప్పారు. ఇప్పటి వరకు లార్జీ ప్రాజెక్టు వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తిరుగు పయనమవగా, ఆయన స్థానంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.