
ఇంట్లో సిగరెట్ తాగినా అక్కడ నేరమే!
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ నగరంలో ధూమపానం నిషేధాన్ని, పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని కఠినంగా నియంత్రిస్తున్నారు. వీధులు, పార్కులు, థియేటర్లు, హోటళ్లు లాంటి బహిరంగ స్థలాలతోపాటు ఇంట్లో ధూమపానం సేవించడం లాంటి ఇండోర్ స్మోకింగ్ కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. దీని వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని, జరిమానాల ద్వారా ఈ ఏడాది 3,30,000 డాలర్లు బీజింగ్ హెల్త్ ఇనిస్పెక్షన్ అధికారులు వసూలు చేశారని బీజింగ్ మున్సిపల్ స్థాయి సంఘం వెల్లడించింది.
ధూమపానాన్ని, పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కోసం గత జూన్ నెల నుంచి కఠినంగా వ్యవహరించడం వల్ల బహిరంగ స్థలాల్లో స్మోకింగ్ చేయని వారి సంఖ్య 3.8 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగినందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అలాగే ధూమపానాన్ని మానాయాలనుకుంటున్న వారి సంఖ్య కూడా 11.6 శాతం నుంచి 46 శాతం పెరిగిందని వారు చెబుతున్నారు. గతంలో బహిరంగ స్థలాల్లో ధూమపానాన్ని నిషేధించగా, గతేడాది జూన్ నెల నుంచి ప్రైవేటు స్థలాల్లో ఇండోర్ స్మోకింగ్‌ను కూడా నిషేధించారు.
గత మే 31వ తేదీనాటికి బీజింగ్ హెల్త్ అధికారులు 1,54,000 సార్లు, 75,828 ఇళ్లపై దాడులు నిర్వహించారని మున్సిపల్ అధికారులు తెలిపారు. నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘించిన 310 వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నామని, 108 పొగాకు ఉత్పత్తుల విక్రయ షాపులను మూసివేశామని వారు తెలిపారు. పాఠశాలలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని వారు స్పష్టం చేశారు.