దక్షిణ చైనా సముద్రంపై చైనా హెచ్చరిక!
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యం విషయంలో చైనా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ సముద్రం విషయంలో చైనాకు ఎలాంటి హక్కులు లేవని, అక్కడ తన ఆగడాలను చైనా మానుకోవాలని ఐరాస నియమిత హేగ్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ.. డ్రాగన్ దేశం తన మంకుపట్టు వీడటం లేదు. హేగ్ ట్రిబ్యునల్ తీర్పును ఆమోదించబోమని తేల్చిచెప్పిన చైనా తాజాగా మరో అడుగు ముందుకేసింది.
దక్షిణ చైనా సముద్రం విషయంలో తమ భద్రతకు భంగం వాటిల్లితే.. ఈ సముద్రంపై గగనతల రక్షణ జోన్ ను ప్రకటిస్తామని పొరుగుదేశాలను హెచ్చరించింది. దక్షిణచైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని తమ సముద్ర జలాల హక్కులను చైనా కాలరాస్తున్నదని ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, బ్రూనై, మలేషియా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఫిలిప్పీన్స్ చేసిన అప్పీలును విచారించిన హేగ్ ట్రిబ్యునల్.. ఈ సముద్రంలో చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను కొట్టివేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అవసరమైతే దక్షిణ చైనా సముద్ర గగనతలంపై గుర్తించిన ప్రాంతంలో వైమానిక రక్షణ జోన్ తాము ప్రకటిస్తామని, ఈ విషయంలో తమకు ఎదురైనా ముప్పు తీవ్రత ఆధారంగా ఈ జోన్ పరిధి ఉంటుందని చైనా ఉప విదేశాంగ మంత్రి లీయూ ఝెన్మిన్ బుధవారం విలేకరులతో తెలిపారు.